Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సర్వేల పేరు పొగబెడుతున్న వైకాపా పెద్దలు.. పార్టీని వీడుతున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు

vemireddy prabhakar reddy

వరుణ్

, గురువారం, 22 ఫిబ్రవరి 2024 (11:48 IST)
ఏపీలోని అధికార వైకాపా అధిష్టానం తమ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు సర్వేల పేరుతో పొగబెడుతున్నారు. దీంతో ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు వీడుతున్నారు. ఇప్పటికే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ కుమార్‌లు పార్టీని వీడారు. తాజాగా నెల్లూరు వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీకి టాటా చెప్పేశారు. ఆయన వైకాపా ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. 
 
ఇలా పార్టీకి టాటా చెప్పిన వారిలో బాలశౌరి అధికారికంగా జనసేనలో చేరారు. ఎంపీలకు కనీస గుర్తింపును ఇవ్వకపోవడం.. పార్లమెంటులోనూ వారు స్వతంత్రంగా మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో వారు పార్టీకి దండం పెట్టి బయటకు వెళ్లిపోయారు. వైకాపాకు ఆర్థికంగా మద్దతుగా నిలిచే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని 2018లో రాజ్యసభకు పంపారు. ఇప్పుడు ఆయన పదవీకాలం ముగియనుంది. ఆయన మరోసారి రాజ్యసభకు వెళ్లేందుకే మొగ్గుచూపినా.. వైకాపా అధిష్టానం మాత్రం ఆయనను నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించింది. పార్టీ కోసం ఆయన పోటీకి సిద్ధపడినప్పటికీ.. పార్టీ పెద్దల నుంచి కనీస మద్దతు లభించలేదు. 
 
తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మూడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులపై జనంలో బాగా వ్యతిరేకత ఉందని, వారిని మార్చాలని ఆయన ముఖ్యమంత్రి జగన్‌‍ను వ్యక్తిగతంగా కలిసి కోరినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన మనస్తాపానికి గురై పార్టీని వీడారు. అలాగే, అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి మార్చారు. తర్వాత ఆమెను అక్కడ నుంచి కూడా తప్పించేశారు. ఇప్పటివరకూ మరెక్కడా ఆమెకు పోటీకి అవకాశం కల్పించలేదు.
 
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలపకపోయినా.. ఎక్కడో ఒక చోట అసెంబ్లీ నియోజవర్గంలోనైనా అవకాశం కల్పించండని మాధవ్ అనేకసార్లు ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఆయనకు ముఖ్యమంత్రి జగన్ నుంచి ఎలాంటి హామీ లభించలేదు. పోలీసు అధికారిగా పనిచేసిన మాధవ్.. 2019 ఎన్నికల సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసి వైకాపాలో చేరి హిందూపురం నుంచి పోటీ చేశారు. ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. 
 
తిరుపతి ఎంపీని సత్యవేడు, చిత్తూరు ఎంపీని గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మార్చారు. కానీ, పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో వారిద్దరినీ మళ్లీ వారి పాత స్థానాల్లోనే పోటీకి నిలుపుతున్నారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఈసారి అసలు పోటీ చేయనని తేల్చేయడంతో.. ఆయన స్థానంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్‌ను సమన్వయకర్తగా నియమించారు. అలాగే, ఎన్నిక షెడ్యూల్ వెల్లడైన తర్వాత ఆ పార్టీని ఎంతమంది వీడుతారోనన్న భయం పట్టుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తూర్పు సిక్కింలో హిమపాతం.. చిక్కుకున్న 500 మంది పర్యాటకులు