చాలామంది చాలా రకాలుగా మాట్లాడినా నేను సంయమనం పాటించడానికి కారణం, నేను నోరు విప్పడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలగరాదు. జనసేన పార్టీకి ప్రజాదరణ ఉన్నా రావడానికి చాలామంది భయపడుతున్నారు. ఇది రాజకీయ పార్టీ కాదు ఒక సామాజిక ఉద్యమం. కులాలకీ, మతాలకీ, ప్రాంతాలకీ అతీతంగా అందరికీ సమన్యాయం జరగాలన్నదే జనసేన పార్టీ లక్ష్యం అని పవన్ కళ్యాణ్ తెలియచేసారు.
ఎక్కడో పాకిస్థాన్‌లో యుద్ధం జరిగిన ప్రతిసారీ ఇక్కడ ఉన్న ముస్లింలు మేం భారత పౌరులమని నిరూపించుకోవాలా.? వారిలోని దేశభక్తిని నిరూపించుకోవాలా.? ఇలాంటి చర్యలు నాకు నచ్చవు. కులాలకీ, మతాలకీ, ప్రాంతాలకీ అతీతంగా అభివృద్ధి జరగాలి. సినిమా థియేటర్‌లో జనగణమణ పాడితేనే దేశభక్తి అనడం నాకు నచ్చదు. సినిమాకి వెళ్లేది వినోదం కోసం దేశభక్తిని చూపడానికి కాదు. దేశభక్తి చూపాలంటే యుద్ధ రంగానికి వెళ్తాం. నా దృష్టిలో ఆడపడుచులకి జరుగుతున్న అన్యాయాన్ని ఆపడం దేశభక్తి.
లంచగొండితనం లేని సమాజ స్థాపన దేశభక్తి, దోపిడి చేయనితనం దేశభక్తి. వేల కోట్లు దోచేసి జెండాకి సలాం చేస్తే అది దేశభక్తి ఎలా అవుతుంది. దోపిడీలు ఆపండి. ఫ్యాక్షనిజాన్ని అరికట్టండి. రౌడియిజాన్ని అణచివేయండి. ఆడపడుచులకి జరుగుతున్న అన్యాయాలని ఆపండి అది దేశభక్తి. జాతీయ గీతానికి సలాం కొట్టి వేల కోట్లు దోచేస్తే అదేం దేశభక్తి. అవసరం అయితే దేశం కోసం ప్రాణాలు ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఈ దేశంలో నివశించే హక్కు అందిరికీ ఉంది. అయితే ఇక్కడ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రజల డబ్బు ఏ స్థాయిలో వృధా అవుతున్నాయి అంటే... జగన్నాథగట్టు ప్రాంతానికి వెళ్లి చూస్తే 9,400 ఇళ్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి.
అన్ని వర్గాల మహిళలు నా దగగ్గరకి వచ్చి తమ బాధని వెళ్లగక్కారు. ఇళ్లు ఉన్నాయి. కప్పులు లేవు. ఉన్న వాటిని ఇచ్చేందుకు నాయకులకి మనసు ఒప్పదు. ఇవ్వాలంటే వారికి గులాంగిరి చేయాలి. ఇది ప్రజల హక్కుల్ని హరించడమే. ఈ దేశంలో నివశించే హక్కు అందరికీ ఉంది. ఆ హక్కుని జనసేన పార్టీ కాపాడుతుంది. విద్యార్ధుల సమావేశంలో చెప్పాను. విద్యార్ధినులు ఉన్నత చదువులు చదువుకోవాలి. అందుకు వారికి కావాల్సింది ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ కాదు. కాలేజీలకి వెళ్లే వారికి డబ్బు ఖర్చయ్యే పరిస్థితి ఉండరాదు. వేల కోట్లు దోచేసేందుకు డబ్బు ఉన్నప్పుడు, మీ చదువులకి డబ్బు ఎందుకు ఉండదు. నేను మీకు అండగా ఉంటాను అన్నారు.