రాజకీయాల్లోకి రావాలంటే పెద్ద తెలివితేటలు అక్కర్లేదనీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అదేసమయంలో తాను మళ్లీ సినిమాలు చేస్తే ఎవరూ ఊహించనంత డబ్బు ఇస్తారన్నారు.
తన అమెరికా పర్యటనలో భాగంగా, పవన్ బుధవారం డల్లాస్‌లో జనసేన ప్రవాసగర్జన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, కొన్ని సందర్భాల్లో కోట్లాది రూపాయలను వెనక్కి ఇచ్చేశానని గుర్తుచేశారు. తాను పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న సమస్యలు భావి తరాలకు ఉండకూడదన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. 2019లో తాను ముఖ్యమంత్రిని అవుతానో లేదో భగవంతుడి చేతిలో ఉందని అభిప్రాయపడ్డారు.
ఇకపోతే, తాను పార్టీ ఫండ్ కోసం అమెరికా రాలేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. తాను ఆత్మగౌరవంతో బతుకుతున్నవాడినని చెప్పారు. రాజకీయాల్లోకి రావాలంటే గొప్ప తెలివితేటలు అక్కర్లేదన్నారు. ధైర్యంతోపాటు కమిట్‌మెంట్ ఉంటే చాలని అభిప్రాయపడ్డారు. ఏదో ఒక రోజు భారతదేశంలో జనసేన జెండా ఎగురుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగువారి తరపున పోరాడేందుకు జనసేన సిద్ధంగా ఉందని.. హెచ్1బీ వీసాల విషయంలో అవసరమైతే కేంద్రంతోపాటు అమెరికా అధికారులతోనూ మాట్లాడుతామని పవన్ వెల్లడించారు.