Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో పావుగంటలో పట్టాదార్ పాస్ పుస్తకం, టైటిల్ డీడ్

అమరావతి: ప్రజల సౌకర్యార్ధం రెవెన్యూ శాఖలో వినూత్నమైన మార్పులు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి చెప్పారు. సచివాలయం 2వ బ్లాక్‌లోని తన చాంబర్లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అన్ని రకాల పనులు సామాన్య

ఏపీలో పావుగంటలో పట్టాదార్ పాస్ పుస్తకం, టైటిల్ డీడ్
, మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (20:29 IST)
అమరావతి: ప్రజల సౌకర్యార్ధం రెవెన్యూ శాఖలో వినూత్నమైన మార్పులు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి చెప్పారు. సచివాలయం 2వ బ్లాక్‌లోని తన చాంబర్లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అన్ని రకాల పనులు సామాన్యులకు కూడా అత్యంత తక్కువ సమయంలో జరిగే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు గతంలో మాదిరి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఇప్పుడులేదన్నారు. 
 
ప్రభుత్వ పథకాల వివరాలు తెలియజెప్పడంతోపాటు ప్రజలకు ఇంకా ఏం కావాలో తెలుసుకునేందుకు తమ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 50 రోజులపాటు ఇంటింటికి వెళ్లే కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. తాను నిర్వహించే రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్, సర్వే శాఖలలో సాంకేతికంగా అనేక మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపారు. దేశంలోనే అత్యున్నత స్థాయిలో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు చెప్పారు.
 
సామాన్య రైతులు పట్టాదర్ పాస్ పుస్తకం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా మీ సేవలో రూ.25 చెల్లిస్తే పావుగంటలో పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ పొందే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ విధానాన్ని ఆగస్ట్ 4న ప్రారంభించగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 16,848 మంది లబ్దిపొందినట్లు చెప్పారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 5,410 మంది పాస్ పుస్తకాలు పొందినట్లు తెలిపారు. మీభూమి వెబ్ సైట్‌లో ఉచితంగా కూడా పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ పొందే సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. రెవెన్యూ శాఖ రూపొందించిన లోన్ క్రియేషన్ మాడ్యూల్‌కు 2016-17 సంవత్సరానికి ఈ గవర్నెన్స్ క్యాటగిరీలో కేంద్ర ప్రభుత్వం బంగారు పతకం బహూకరించినట్లు తెలిపారు. 
 
రైతులకు నష్టపరిహారం చెల్లింపులో ఈ-పంట కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు తెలిపారు. చుక్కల భూముల సమస్య పరిష్కారానికి జూలై 17న జీఓ జారీ చేసినట్లు చెప్పారు. ఈ జీఓ ద్వారా 24 లక్షల ఎకరాల భూమికి సంబంధించిన యాజమాన్య హక్కుల సమస్య పరిష్కారమవుతుందన్నారు. చుక్కల భూములు 12 సంవత్సరాల నుంచి తమ అనుభవంలో ఉన్నట్లు ఆధారాలు చూపితే, వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 9,701 దరఖాస్తులు అందినట్లు, నిర్దేశిత 6 నెలల గడువులోపల వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. 
 
రాష్ట్రంలో వంద గజాల లోపు ప్రభుత్వ స్థలం ఆక్రమించి నివాసం ఉంటున్న నిరుపేదలకు ఉచితంగా ఆ స్థలాలను క్రమబద్దీకరిస్తున్నామన్నారు. ఈ విధానం ద్వారా 35,286 మంది లబ్ది పొందుతారని తెలిపారు. ఆక్రమించిన వారు స్థితిమంతులైతే 2013 మార్కెట్ ధరలో 7.5 శాతం చెల్లించి క్రమబద్దీకరించుకోవచ్చునని చెప్పారు. 101 నుంచి 250 గజాల లోపల వరకు ఆక్రమించితే 2013 మార్కెట్ విలువలో 15 శాతం, 251 నుంచి 500 గజాలైతే మార్కెల్ విలువలో 30 శాతం చెల్లించి క్రమబద్దీకరించుకునేవిధంగా వెసులుబాటు కల్పించినట్లు వివరించారు.
 
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న గాజువాక భూములకు పరిష్కారం చూపిట్లు చెప్పారు. గాజువాక ప్రాంతంలో 5,385 మందికి పట్టాలు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,41,072 మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఒక్క విశాఖపట్నంలోనే 51,911 మంది లబ్దిపొందారన్నారు. భూ రికార్డుల సమగ్ర సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 735 డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సర్వే అభ్యర్థనలు పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 623 జీటీఎస్, 9 డీజీపీఎస్ మిషన్లు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. 
 
రెండు వేల మందికి పైగా లైసెన్స్ డ్ సర్వేయర్లకు శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలిపారు. విమానాశ్రయాలు, ఏపీఐఐసీ, పోర్టులు, రైల్వే, జాతీయ రహదారులు, పరిశ్రమల హబ్, ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు అవసరమైన భూముల సేకరణలో సర్వేయర్లు కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు. ఇప్పటికి 5 లక్షల 10వేల ఎకరాలు సర్వే చేసినట్లు తెలిపారు. వివాదాలు లేని భూ రికార్డుల నిర్వహణకు ‘మీ ఇంటికి మీభూమి’ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 
 
ధృవీకరణ పత్రాల కోసం విద్యార్థులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులే నేరుగా పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లి విద్యార్థుల వివరాలు నమోదు చేసుకొని, వారికి కావలసిన ధృవీకరణ పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ విధంగా 10,33,024 మంది విద్యార్థులకు వివిధ రకాల ధృవపత్రాలు అందజేసినట్లు చెప్పారు. మీ సేవ ద్వారా ప్రజలకు కావలసిన 55 రకాల సేవలు రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉన్నాయన్నారు. రైతులు మ్యూటేషన్ దరకాస్తు చేసుకున్న తరువాత నిర్ణీత గడువు 30 రోజులు గడచిన వెంటనే వెబ్ ల్యాండ్‌లో పేరు నమోదు అయ్యేవిధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
 
వడ్డీ వ్యాపారుల నుంచి కౌలు రైతులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం రుణ అర్హత పత్రాలు అందజేసి, బ్యాంకులలో రుణం పొందే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. రెవెన్యూ శాఖ చరిత్రలో మొదటిసారిగా రాష్ట్రంలో 105 తహశీల్దార్ భవనాలు, 8 ఆర్డీఓ భవనాలు నిర్మాణానికి అనుమతి మంజూరు చేసినట్లు చెప్పారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా 9 అర్బన్ మండలాలు ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిపారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయ లక్ష్యం రూ. 4వేల కోట్లు కాగా, ఆగస్ట్ వరకు రూ. 1,724 కోట్లు ఆదాయం లభించినట్లు వివరించారు. కర్నూలు- బెంగళూరు కారిడార్ అభివృద్ధికి మంత్రి లోకేష్ కృషి చేస్తున్నట్లు చెప్పారు. కర్నూలు, కాకినాడలలో గెలుపు క్రెడిట్ అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికే చెందుతుందని కెఇ కృష్ణ మూర్తి చెప్పారు. 
 
పట్టాదార్ పాస్ పుస్తకాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ల దృష్టికి తీసుకువెళితే వారు పరిష్కరిస్తారని రెవెన్యూ అధికారులు చెప్పారు. బోగస్ పట్టాదార్ పాస్ పుస్తకాల సమస్య లేకుండా ఎలక్ట్రానిక్ రికార్డుల ప్రకారం బ్యాంకులలో రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొండ గుట్టవైపు తెలిసిన వ్యక్తితోనే చాందినీ... సీసీ టీవీలో స్పష్టం...