భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ప్రకటించాడు. 35 ఏళ్ల పార్థివ్.. టీమిండియా తరపున 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడాడు.
దేశవాళీ క్రికెట్‌లో గుజరాత్ తరఫున 194 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన పార్థివ్.. బుధవారం ట్విటర్ వేదికగా తన రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించాడు. ఈ 18 ఏళ్ల తన కెరీర్‌లో తనకు సహకరించిన బీసీసీఐ, అందరు కెప్టెన్లకు కృతజ్ఞతలు చెబుతూ.. ట్విటర్‌లో ఓ లేఖను పోస్ట్ చేశాడు.
2002లో తొలిసారి ఇండియన్ టీమ్ తరపున ఆడిన పార్థివ్.. టెస్టుల్లో అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. భారత క్రికెట్ జట్టులోకి వచ్చినప్పుడు అతని వయసు 17 ఏళ్ల 153 రోజులు.
మొదట్లో అతను ఫర్వాలేదనిపించినా.. దినేష్ కార్తీక్, ఎమ్మెస్ ధోనీ రాకతో క్రమంగా టీమ్‌లో స్థానం కోల్పోయాడు. 2004లో తొలిసారి టీమ్‌లో స్థానం కోల్పోయిన పార్థివ్.. తర్వాత మరోసారి అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఐపీఎల్‌లో అతడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ తరపున ఆడుతున్నాడు.