Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కృష్ణాజిల్లాలో పాండురంగని ఉత్సవాలు ప్రారంభం

కృష్ణాజిల్లాలో పాండురంగని ఉత్సవాలు ప్రారంభం
, శుక్రవారం, 27 నవంబరు 2020 (22:40 IST)
భక్తులను అనుగ్రహించి వారికోసం ప్రత్యక్షమైన దేవుళ్ళ గురించి పురాణాల్లో చదివాము, విన్నాము గానీ, కలియుగంలో భక్తుని కోసం భగవంతుడు సాక్షాత్కరించాడంటే నమ్మగలమా. కానీ అది కృష్ణాజిల్లా మచిలీపట్నం చిలకలపూడిలోని కీర పండరీపురం చరిత్ర చదివాక నమ్మక తప్పదు. 

చిలకలపూడి అనగానే చాలామంది మహిళామణులకు చిలకలపూడి బంగారం నగలు, అవేనండీ రోల్డుగోల్డు నగలు గుర్తుకొస్తాయి.  ఈ రోజుల్లో అవికూడా ప్రియమయిపోతున్నాయి. కానీ అంతకన్నా ప్రియమైంది చిలకలపూడిలో మరొకటి వున్నది.  అదే పాండురంగడు స్వయంగా సాక్షాత్కరించిన కీర పండరీపురము. చరిత్రలోకి వెళితే కృష్ణాజిల్లా మచిలీపట్నం చిలకలపూడిలో వున్న ఈ క్షేత్రానికి కీర పండరీపురం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలియదు. 

పూర్వం ఇక్కడ దోస వ్రతం చేసేవారుట. అంటే దోస విత్తులు నాటి, అవి పెరిగి కాయలు కాసేదాకా వాటిని సంరక్షించి, భగవంతునికి సమర్పించటం. అందుకనే కీర పండరీపురం అనే పేరు వచ్చి వుండవచ్చునని కొందరి అభిప్రాయం.  ఈ క్షేత్ర నిర్మాణానికి కారకుడైన భక్త నరసింహం అంతకుముందు  కాకి బంగారంతో నగలు చెయ్యటం కూడా కనిపెట్టారని అంటారు.
 
1889 ఏప్రిల్ 4వ తేదీన విశాఖపట్నం జిల్లా బొబ్బిలి తాలూకా లోని ఉత్తరావెల్లి గ్రామములో విశ్వకర్మ కులస్తులైన  గంగాధరం, రామమ్మ దంపతులకు జన్మించారు సరసింహం. ఈయనకు చిన్నతనం నుంచే దైవ భక్తి చాలా ఎక్కువ.  తన 18వ సంవత్సరంలో చిలకలపూడి వచ్చిన నరసింహం  అక్కడే వ్యాపారం చెయ్యటం మొదలుపెట్టి, కుటుంబ వ్యవహారాల్లో మునిగిపోయారు. 

క్రమంగా ఆయన మనసు దైవభక్తి వైపు అధిక మొగ్గు చూపించి, పాండురంగ విఠలుని వైపు మళ్ళింది.  నరసింహం ఒకసారి పండరీపురం వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ మహీపతి గూండా మహరాజ్ అనే గురువుగారి దర్శనమయింది.  ఆయన నరసింహంకి పాండురంగోపాసన విధానం తెలిపి శ్రీ విఠ్ఠల మంత్రముతో తులసిమాల ప్రసాదించారు. కొంతకాలం  తరువాత శ్రీ విఠ్ఠల మహామంత్ర రాజమును కూడా ఉపదేశించి భక్త నరసింహం అనే పేరు పెట్టారు.
 
గురువుగారి ఆశీర్వచనముతో భక్త నరసింహం తన మనసులోని కోరిక, ఆలయ నిర్మాణమును తలపెట్టారు.  శంఖుస్ధాపన కోసం పండరీపురము లోని చంద్రభాగానది లోని కొన్ని గులక రాళ్ళను ఉపయోగించ సంకల్పించారు.  కానీ చంద్రభాగా నది ఆ సమయంలో మహా ఉధృతంగా ప్రవహిస్తూ, ఈతగాళ్ళుకూడా నదినుండి రాళ్ళు తియ్యలేని పరిస్ధితిగా వున్నది.  అప్పుడు నరసింహం చంద్రభాగను ప్రార్ధించగా పుండరీక దేవాలయము పక్కన ఇసుక దిబ్బ ఏర్పడింది.
 
నరసింహం పడవలో అక్కడికి వెళ్ళి నదిలోని ఇసుక, రాళ్ళు, నీరు సేకరించి తిరిగి వచ్చారు.  ఆ ఇసుకలో ఒక చిన్న గుండురాయి దొరికింది.  వాటన్నింటినీ పాండురంగని ముందుంచి, నరసింహం, వారి గురువు ప్రార్ధనా తన్మయత్వంలో వుండగా పాండురంగని నుంచి ఒక జ్యోతి ఆ గుండ్రని రాయిలో ప్రవేశించింది. 

ఆ రోజు రాత్రి పాండురంగడు నరసింహంగారి కలలో సాక్షాత్కరించి, కీర పండరీక్షేత్రములో శ్రీ శుక్లనామ సంవత్సరం, కార్తీక శుధ్ధ ఏకాదశి బుధవారం (13-11-1929) పగలు తన మూర్తి సాక్షాత్కరించగలదని తెలిపారు.  నరసింహం సంతోషంగా తిరిగివచ్చి ఆలయ నిర్మాణం ప్రారంభించారు.
 
కొంతకాలం తర్వాత గురువుగారైన మహీపతి మహరాజ్ గారికి పాండురంగడు స్వప్న దర్శనమిచ్చి నీశిష్యుని కోసం కార్తీక శుద్ధ ఏకాదశి రోజున కీర పండరిపురంలో సాక్షాత్కరిస్తానని తెలుపగా వారు లేఖద్వారా నరసింహంకి ఈ విషయం తెలియజేశారు.  పాండురంగని విగ్రహం తప్ప ఆలయ నిర్మాణము పూర్తయినది. 

పాండురంగని సాక్షాత్కార వార్త అందరికీ తెలిసి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఆ విశేషం దర్శించాలని ప్రజలు తండోపతండాలుగా కీర పండరిపురం వచ్చారు. అప్పట్లో బ్రిటీషు వారి పాలనలో ఉండటంతో అధికారులు, కొందరు పెద్దలు దీనిని నమ్మక గర్భగుడికి తాళంవేసి సీలు చేశారు. 

క్షణాలు గడుస్తన్నకొద్దీ నరసింహంగారికి ఆందోళన ప్రారంభంమయింది.  ఆంజనేయస్వామి ఆలయంలో ఆయనను ప్రార్ధిస్తూ  తన్మయావస్తలో వుండగా ఆంజనేయుడు ఆయనకి ఆభయమిచ్చాడుట..  పన్నెండు గంటలయ్యేసరికి శ్రీ పాండురంగడు ప్రసన్నుడు కాకపోతే పండరీ క్షేత్రాన్ని ఇక్కడికి తీసుకువచ్చి స్ధాపిస్తానని.
 
పగలు పదిన్నర అయింది. దేవాలయమునకు వేసిన తాళం తీసి తలుపులు తీయటానికెంత ప్రయత్నించినా తలుపులు రాలేదు.  భక్త నరసింహంగారు అనేక ప్రార్ధనలు చేయగా తలుపులు తెరువబడి, దివ్య తేజస్సుల మధ్య, పెద్దగా శబ్దం చేస్తూ పాండురంగని విగ్రహ సాక్షాత్కరించింది. మూడు అడుగుల ఎత్తున్న ఈ విగ్రహము మహారాష్ట్ర పండరీపురము లోని పాండురంగని విగ్రహమువలెనున్నది.  అక్కడలాగానే భక్తులందరూ గర్భగుడి లోని పాండురంగని పాదములు తాకి నమస్కరించవచ్చు.
 
తదుపరి భక్త నరసింహంగారు సహస్రకోటి శ్రీ విఠలనామ యజ్ఞము తలబెట్టగా భారతావనిలో అనేకమంది ఈ యజ్ఞములో పాల్గొని శ్రీ విఠలనామమును వ్రాశారు.  ఆ పుస్తకములన్నియు తగు పూజావిధానముతో ఆలయప్రాంగణములోని విఠల్ కోటి స్ధూపములో నిక్షిప్తం గావించబడ్డాయి.
 
శ్రీ పాండురంగని ఆలయానికి ఎదురుగా భక్త నరసింహంగారికి అభయమొసగిన ఆంజనేయస్వామి ఆలయం వున్నది.  ప్రక్కనే వేరొక ఆలయంలో సహస్ర లింగ కైలాస మంటపము విరాజిల్లుతుంటే ఇంకొకపక్క రాధ, రుక్మిణి, సత్యభామ, అష్టలక్ష్ములకు వేరొక ఆలయము నిర్మింపబడ్డది. 

ఆరు ఎకరాల స్ధలంలో నిర్మింపబడ్డ ఈ ఆలయాలకు చుట్టూ భక్త మందిరాలు. వాటిలోనే షిర్డీ సాయిబాబా మందిరం. దానికి ఎదురుగా అతి పురాతనమైన అశ్వధ్ధ వృక్షము, దానికింద చిన్న సిధ్ధేశ్వరాలయము.  400 ఏళ్ళ పైనుంచి వున్న ఈ అశ్వధ్ధ వృక్షం కింద భూగర్భంలో ఒక ఋషి ప్రాచీన కాలంనుంచి తపస్సు చేసుకుంటున్నారని, ఆయన ఇప్పటికీ వున్నారనీ, భక్త నరసింహంగారికి ఆయన దర్శనమిచ్చారనీ అంటారు.
 
భగవంతుడు భక్త సులభుడు అని మరొకసారి నిరూపించిన నరసిహంగారు 16-1-1974 సంవత్సరంలో పరమపదించారు.  ఆ సమయంలో ఆయన శరీరంనుంచి విద్యుత్కాంతిలాంటి వెలుగు వెలువడి పాండురంగనిలో ఐక్యమందటం, సహస్రలింగ మంటపం వద్ద గంటలు ఓంకారనాదంతో మోగటం అనేకమంది చూశారంటారు. 
 
దేవాలయ నిర్మాణ సమయంలోనే పాండురంగని ఆజ్ఞ ప్రకారం మహా మండపమునందు సమాధి నిర్మించి దానిమీద ఒక రాయి పరచి వుంచి అవసరమైనప్పుడు తన శరీరాన్ని అక్కడ వుంచమన్నారు.  ఆవిధంగానే చేసి అక్కడ ఆయన విగ్రహాన్ని స్ధాపించారు.
 
ఈ వార్తలకు సంబంధించి ఆనాడు వెలువడిన వార్తాపత్రికలు ఫ్రేము కట్టించి ఆలయంలో సందర్శకులకోసం వుంచారు.  నరసింహం మనుమలు ప్రస్తుతం ఆలయాన్ని నిర్వహిస్తున్నారు.
 
సముద్ర తీరంలో వున్న ఈ ఆలయానికి, ఆషాఢ, కార్తీక మాసాల్లో జరిగే బ్రహ్మోత్సవాలకు మన రాష్ట్రం నుంచే కాక ఒరిస్సా, ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి నుండి  పౌర్ణమి వరకు పాండురంగని ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భక్తులు ప్రతిరోజూ స్వామివారికి పూజలు, దీపరాధనలు, కోలాటాలు, చెక్క భజనలు, భజనలు చేస్తారు. స్వామి వారికి పటికబెల్లం అంటే ఇష్టం కనుక నైవేద్యం గా పటిక బెల్లం సమర్పిస్తారు.

పౌర్ణమి ముందు రోజు రాత్రి భజనలతో జాగారం చేసి, తెల్లవారు ఝామున కాలినడకన భజనలు చేసుకుంటూ సముద్ర స్నానం చేసి ఎవరి ప్రదేశాలకు వారు వెళతారు. ఈ ఆలయం ఇప్పటికీ భక్త నరసింహం సంతతి వారిచే నిర్వహించబడుతున్నది.  కృష్ణాజిల్లా ముఖ్యపట్టణమైన చిలకలపూడిలో వున్న ఈ ఆలయం చేరుకోవటానికి వివిధ ప్రాంతాలనుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి.  విజయవాడకి షుమారుగా 80 కి.మీ. ల దూరంలో వున్నది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'శిల్పారామం' వెబ్ సైట్ ప్రారంభం