ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం తీవ్రరూపం దాల్చింది. ఈ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ జారీచేశారు. దీంతో మళ్లీ రాజకీయ దుమారం చెలరేగింది. నిమ్మగడ్డను లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాకి భయపడుతూ మాట్లాడిన నిమ్మగడ్డ ఎన్నికలు పెడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. గ్లాస్ బోర్డు వెనుక ఉండి కరోనాకి భయపడుతూ నిమ్మగడ్డ ప్రెస్ మీట్ పెట్టారన్న ఆయన... నిమ్మగడ్డ ప్రెస్ మీట్ చంద్రబాబు ప్రెస్ మీట్‌లా ఉందని ఆరోపించారు.
నిమ్మగడ్డ ఒక మూర్ఖుడు అని ఉద్యోగ సంఘాలు ఎన్నికలు వద్దు అంటున్నా నిమ్మగడ్డ వినటమే లేదని అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఉద్యోగుల ప్రాణాలకు ఏమన్నా అయితే బాధ్యత నిమ్మగడ్డ వహిస్తారా ? అని ఆయన ప్రశ్నించారు.
నిమ్మగడ్డకి పిచ్చి పీక్ లెవెల్‌కి వెళ్ళిందన్న ఆయన నిమ్మగడ్డ రమేష్ ఎందుకు గ్లాస్ అడ్డంపెట్టుకుని మీడియాతో మాట్లాడారో చెప్పాలి! అని డిమాండ్ చేశారు. ఎన్నికలకు నిమ్మగడ్డ మాత్రమే సిద్ధంగా ఉన్నారన్న ఆయన ప్రజలు, ఉద్యోగులు సిద్ధంగా లేరనీ అన్నారు.
అలాగే, ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా విమర్శలు గుప్పించారు. ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సుప్రీంకోర్టులో కేసు ఉండగా.. వ్యాక్సినేషన్ జరుగుతుండగా ఎన్నికల నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కొందరితో కలిసి కుట్ర చేస్తున్నారని మండిపడిన ఆయన... చంద్రబాబు చెప్పినట్టుగానే ఎస్‌ఈసీ నడుచుకుంటున్నారంటూ ఆరోపించారు. కరోనాతో ఉద్యోగులు భయపడుతున్నా... వారి విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు..