తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో వైభవంగా నిర్వహించాలని టిటిడి తిరుపతి జెఈవో పి.బసంత్‌కుమార్ ఆదేశించారు.
తిరుచానూరులోని ఆస్థానమండపంలో జెఈవో సోమవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ నవంబరు 23 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని, అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు తదితర ఇంజినీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆలయం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పిఏ సిస్టమ్, ఎల్‌ఇడి తెరలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కళాబృందాల ప్రదర్శనలను మొదట పరిశీలించిన తరువాత మాత్రమే ఎంపిక చేయాలన్నారు. భక్తులను ఆకట్టుకునేలా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి, శిల్పారామం, తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని కోరారు.
శుక్రవారపు తోటలో పుష్పప్రదర్శనశాలతో పాటు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు చేపట్టాలని జెఈవో సూచించారు. బ్రహ్మోత్సవాల రోజులతో పాటు పంచమితీర్థం నాడు మెరుగ్గా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, తోళప్ప గార్డెన్స్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా, పోలీసు, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. బ్రహ్మోత్సవాలను సంప్రదాయబద్ధంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు.
సమావేశంలో టిటిడి ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి, చీఫ్ ఇంజినీర్ జి.రామచంద్రారెడ్డి, అదనపు సివిఎస్‌వో శివకుమార్‌రెడ్డి, డిఎస్పి టి.మురళీకృష్ణ, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్) వేంకటేశ్వర్లు, ట్రాన్స్‌పోర్టు జిఎం శేషారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, హెచ్‌డిపిపి కార్యదర్శి రాజగోపాలన్, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్, ఏఈవో సుబ్రమణ్యం ఇతర అధికారులు పాల్గొన్నారు.