విశాఖపట్టణం జిల్లా పాడేరు ఏఎస్పీ శివకుమార్ మృత్యువాతపడ్డారు. ఆయన వద్ద ఉండే రివాల్వర్ పేలడంతో తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. అయితే, ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తుపాకీ ప్రమాదవశాత్తు పేలిందా? లేదా ఆయనకే కాల్చుకుని ప్రాణాలు విడిచాడా అనే సందేహం ఉత్పన్నమైంది.
తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లాకు చెందిన శివకుమార్.. ఐపీఎస్‌కు ఎంపీకై కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఏఎస్పీగా విధుల్లో చేరారు. అక్కడి నుంచి జనవరిలో పాడేరు ఏఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వ్యక్తి అని సహచరులు చెపుతుంటారు. అవివాహితుడైన శివకుమార్.. ఆళ్లగడ్డలో పనిచేసినప్పుడు ఎర్రచందనం ముఠాలపై ఉక్కుపాదం మోపాడు. అలాగే, పాడేరులోనూ మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టి సత్ఫలితాలు సాధించారు. అలాంటి అధికారి ఇపుడు ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.