Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

1000 మంది పురుషులకు 938 మంది మహిళలు... లింగ నిర్ధారణ పరీక్షలను అడ్డుకోవాలి

అమరావతి: రాష్ట్రంలో లింగనిర్ధారణ పరీక్షలకు వ్యతిరేకంగా విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని పీసీపీఎన్ డీటీ (ప్రీ-కన్సెప్షన్ అండ్ ప్రీ-నాటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్-లింగనిర్ధారణ పరీక్షల నిరోధక) చట్టం రాష్ట్ర పర్యవేక్షిక మండలి సమావేశంలో నిర్ణయించారు.

1000 మంది పురుషులకు 938 మంది మహిళలు... లింగ నిర్ధారణ పరీక్షలను అడ్డుకోవాలి
, సోమవారం, 6 నవంబరు 2017 (20:15 IST)
అమరావతి: రాష్ట్రంలో లింగనిర్ధారణ పరీక్షలకు వ్యతిరేకంగా విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని పీసీపీఎన్ డీటీ (ప్రీ-కన్సెప్షన్ అండ్ ప్రీ-నాటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్-లింగనిర్ధారణ పరీక్షల నిరోధక) చట్టం రాష్ట్ర పర్యవేక్షిక మండలి సమావేశంలో నిర్ణయించారు. సచివాలయం 5వ బ్లాక్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య అధ్యక్షతన జరిగింది. ఈ చట్టంపై ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులకు, ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు, అధికారులకు, ప్రజలకు, స్వచ్ఛంద సంస్థలకు, ముఖ్యంగా మహిళలకు అవగాహన కల్పించాలని తీర్మానించారు. 
 
లింగనిర్ధారణ పరీక్షలు చేసి, ఆడపిల్ల అని తెలిసిన తరువాత అబార్షన్లకు పాల్పడే నర్సింగ్ హోంలపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలోని 200 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆల్ట్రా సోనోగ్రాఫ్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. లింగ నిర్ధారణ పరీక్షలకు వ్యతిరేకంగా యాడ్ ఫిల్మ్ రూపొందించి సినిమా థియేటర్లు, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా, అలాగే ప్రింట్ మీడియా ద్వారా భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని ప్రతిపాదించారు. లింగ నిర్ధారణ, అవాంచిత అబార్షన్లు చేయడం, చేయించడం నేరం అన్న అంశాన్ని  బాగా ప్రచారంలోకి తీసుకురావాలని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ అంశానికి సంబంధించి వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని, అలాగే 102, 104 వంటి టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్లను అందరికీ తెలియజేయాలని, గర్భం ధరించిన ప్రతి మహిళ పేరుతో ఆధార్ నంబర్ జతచేయడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
 
పూనం మాలకొండయ్య మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్లిళ్లకు ఎక్కువ ఖర్చవుతుందని భయపడుతున్న పరిస్థితుల్లో  అందరూ ముఖ్యంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, సమావేశంలో పాల్గొన్న మనమందరం పిల్లల పెళ్లిళ్లను ఆర్భాటం లేకుండా సింపుల్‌గా చేయాలన్నారు. పెళ్లి పేరుతో కొందరు అనవసరంగా భారీస్థాయిలో వ్యయం చేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. మండలి సభ్యులతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేయడం, డాక్టర్స్ కు చెందిన వివిధ అసోసియేషన్ల తో కూడా సమావేశమై అవగాహన కల్పిస్తామన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 938 మంది మాత్రమే మహిళలు ఉన్నారని, ఈ వ్యత్యాసాన్ని తగ్గించవలసి అవసరం ఉందన్నారు. లింగనిర్ధారణ పరీక్షల నిరోధక చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేసి ఆదర్శ రాష్ట్రంగా నిలిపేందుకు కృషి చేస్తామని చెప్పారు. 
 
సమావేశంలో గర్భిణీస్త్రీలు ఎదుర్కొనే గృహ హింస, సమస్యలు, వారిపై వత్తిడి, లింగ నిర్ధారణ చేసే ల్యాబ్స్, ఆడపిల్ల అని తెలిసిన తరువాత అవాంచిత అబార్షన్లు చేసే నర్సింగ్ హోమ్స్, చట్లం, చట్టంలో తల్లికి ఉన్న రక్షణ, నర్సింగ్ హోంలపై కేసులు నమోదు చేసిన సందర్భాల్లో ఆ అధికారులపై వేధింపులు, కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేల జోక్యం, లింగ నిర్ధారణ, అబార్షన్ ఎన్ని వారాలకు చేస్తారు తదితర అంశాలన్నిటినీ లోతుగా చర్చించారు.
 
ఉన్నతాధికారులు, ఉన్నత విద్యావంతులు, ధనవంతులు, రాజకీయ నాయులు కూడా విచక్షణారహితంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని కొందరు సభ్యులు చెప్పారు. లింగ నిర్ధారణ, అబార్షన్‌కు సంబంధించి రాష్ట్రంలో నమోదైన 16 కేసులు, మరి ముఖ్యంగా మచిలీపట్నం, గుంటూరు కేసులను చర్చించారు. ఈ సందర్భంగా హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఏ.ఆర్.అనురాధ మాట్లాడుతూ ఏయే పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయో ఆయా కేసుల వివరాలు తనకు అందజేస్తే తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క విజయనగరం జిల్లాలో తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో విజిలెన్స్ అధికారులు ఉన్నారని, వారి ద్వారా ఏయే నర్సింగ్ హోమ్స్, ల్యాబ్స్‌లో ఎవరు ఇటువంటి చట్టవ్యతిరేక చర్యలు పాల్పడుతున్నారో సమాచారం సేకరించవచ్చునని తెలిపారు. 
 
ముఖ్యంగా సమాజంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని, దానికి తోడు వారికి పెళ్లి చేసి పంపించడం పెద్ద బాధ్యతగా భావిస్తున్నారని, ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో  వరకట్నాలు కూడా ఎక్కువని అందువల్ల కూడా ఆడపిల్ల వద్దని అనుకుంటున్నారని కొందరు సభ్యులు చెప్పారు. ఇటువంటి సంఘటనలు జరిగే ముందు తెలిసినవారు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని, తెలిపిన వారి పేర్లు గోప్యంగా ఉంచాలన్నారు.
 
మొదటిసారి ఆడపిల్ల పుట్టి, రెండవ సారి గర్భం దాల్చిన సందర్భంలో మగ పిల్లవాడు కావాలన్న కాంక్షతో ఇటువంటి చర్యలకు పాల్పడుతుంటారన్నారు. ఆడపిల్లల వల్ల ప్రయోజనాలను కూడా వారికి తెలియజెప్పవలసిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. లింగ నిర్ధారణ పరీక్షలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం కార్పోరేట్ సంస్థల బాధ్యతగా ఉంటే బాగుంటాందని ఒకరన్నారు. సమావేశాలు నిర్వహించడంకంటే నర్సింగ్ హోమ్స్, డాక్టర్లు, ల్యాబ్స్ పై చర్యలు తీసుకోవడం ముఖ్యమని ఇంకొకరన్నారు. ఇటువంటి సంఘటనలకు సంబంధించిన ఫిర్యాదులు తమ వద్దకు రావడంలేదని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ రాజారావు చెప్పారు. 2016లో మచిలీపట్నం నుంచి ఒక ఫిర్యాదు రావడంతో విచారించి, ఆ నర్సింగ్ హోం రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు తెలిపారు. 
 
ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ స్వయం సహాయక గ్రూపులు, స్వచ్ఛంద సంస్థలు, ఏఎన్ఎంలు ద్వారా గర్భిణీల కుటుంబాలవారికి కౌన్సిలింగ్ ఇప్పించడం వంటి చర్యలు చేపడితే ఫలితం ఉంటుందన్న అభిప్రాయ్నని వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడుతూ ప్రభుత్వంలోని అన్ని శాఖలు బాధ్యతగా వ్యవహరించి,  సమన్వయంతో చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. మండలి సమావేశాలు తరచూ జరుపుతూ ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అందరూ ఈ అంశాన్ని సమాజిక బాధ్యతగా స్వీకరించాలని చెప్పారు.
 
ఈ సమావేశంలో ఏపీ  వైద్యవిధాన పరిషత్  కమిషనర్ డాక్టర్ పి.దుర్గాప్రసాదరావు,  అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ గీత, న్యాయ శాఖ జాయింట్ సెక్రటరీ హరిబాబు,  రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ టి.నీరద, ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ కె.సత్యనారాయణ మూర్తి, సమాచార,పౌరసంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ తేళ్ల కస్తూరి, సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ వైవి మోహన్ రెడ్డి, డిప్యూటీ ఎస్పీ పి.ఇందిర, అడిషనల్ ఎస్పీ సి.రాజేశ్వర రెడ్డి, పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ఫ్) డైరెక్టర్ జి.రాజేంద్ర ప్రసాద్, కన్సల్టెంట్ జీ.రోజారాణి, ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ పి.బుజ్జిబాబు, ప్రొఫెసర్ డాక్టర్ పి.వాణికుమారి, డాక్లర్ బీఎస్ వీణా కుమారి, వాసవ్య మహిళామండలి కార్యదర్శి జి.రష్మి తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేవంత్ రెడ్డి ఫిలమెంట్ ఎగిరిపోయే వ్యాఖ్యలు... ఉత్తమ్ అలా అనేశారే...