Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్టీసీ బస్టాండ్లలో ఆప్కో స్టాళ్లు

ఆర్టీసీ బస్టాండ్లలో ఆప్కో స్టాళ్లు
, శనివారం, 20 ఫిబ్రవరి 2021 (10:15 IST)
రాష్ట్రవ్యాప్తంగా ఆప్కో వస్త్రాలకు మరింత మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో ఎంపిక చేసిన ఆర్టీసీ బస్టాండ్‌లలో అందుకు సంబంధించిన కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. ఇందులో భాగంగా ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్‌కు ఆప్కో వైస్‌ చైర్మన్, ఎండీ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ లేఖ రాశారు.

ఫ్లిప్‌కార్డ్, అమెజాన్, మింత్ర, పేటీఎం, లూమ్‌ఫ్లోక్స్‌ తదితర ఈ–కామర్స్‌ సంస్థలతో ఆప్కో ఎంవోయూ కుదుర్చుకుందని లేఖలో వివరించారు. ఆప్కో వ్యాపారాభివృద్ధికి బస్టాండ్లలో స్టాళ్లు కేటాయిస్తే వ్యాపారం పెరుగుతుందని.. అందువల్ల నామమాత్రపు అద్దెలతో స్టాళ్లను కేటాయించాలని కోరారు. ఇందుకు ఆర్టీసీ కూడా సూత్రప్రాయంగా అంగీకరించింది.

స్టాళ్లకు నెలనెలా ఎంత అద్దె వసూలు చేయాలనే అంశాన్ని నిర్ణయించేందుకు త్వరలో నివేదిక ఇవ్వాలని ఎండీ ఠాకూర్‌ ఆదేశించారు. 

రాష్ట్రవ్యాప్తంగా 15 బస్టాండ్లలో ఆప్కో స్టాళ్లు
కాగా, ఈ విక్రయ కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా 15 బస్టాండ్లలో ఏర్పాటుచేయనున్నారు. కార్పొరేషన్లు, ప్రధాన పట్టణాల్లో ఏర్పాటు ద్వారా చేనేత ఉత్పత్తుల విక్రయాలు పెంచాలన్నదే లక్ష్యం. ముందుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం బస్టాండ్లలో వీటిని ఏర్పాటుచేస్తారు.  

అమూల్‌ మిల్క్‌ యూనిట్లకు అవకాశం 
బస్టాండ్లలో ఆప్కో స్టాళ్లకే కాకుండా అమూల్‌ మిల్క్‌ యూనిట్లకు స్టాళ్లను కేటాయించేందుకు ఆర్టీసీ సుముఖంగా ఉంది. కొన్ని బస్టాండ్లలో సంగం డెయిరీకి స్టాళ్లను కేటాయించిన సంగతి తెలిసిందే. అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని పాడి రైతుల అభివృద్ధికి పాటు పడుతున్నందున అమూల్‌ ఉత్పత్తులకూ స్టాళ్లను ఆర్టీసీ కేటాయించనుంది. ఇదేకాక విశాఖపట్నం ద్వారకా బస్టాండ్‌లో మత్స్యశాఖకు ఓ స్టాల్‌ను ఆర్టీసీ అధికారులు ఇటీవలే కేటాయించారు.  
 
త్వరలో స్టాళ్లను కేటాయిస్తాం: ఆర్పీ ఠాకూర్, ఎండీ, ఆర్టీసీ
రాష్ట్రంలో ప్రధాన బస్టాండ్లలో స్టాళ్లను త్వరలోనే కేటాయిస్తున్నాం. దీనిద్వారా చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగానే ఆర్టీసీ నడుచుకుంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12వ రోజు కూడా ఇతే తంతు.. డీజిల్‌, పెట్రోలు ధరలు పెంపు