తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో త్వరలో ఆన్‌లైన్ వర్చువల్ కల్యాణోత్సవం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సోమవారం నుండి శుక్రవారం వరకు వర్చువల్ కల్యాణోత్సవం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఈ టికెట్ ధరను రూ.500/-గా నిర్ణయించారు. గృహస్తులు ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుక్ చేసుకుని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కల్యాణోత్సవాన్ని వీక్షించవచ్చు.
ఆ తరువాత 90 రోజుల్లోపు గృహస్తులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రూ.100/- ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్‌లో ఉచితంగా దర్శించుకోవచ్చు. దర్శనానంతరం ఒక ఉత్తరీయం, ఒక రవికె, అక్షింతలు ప్రసాదంగా అందిస్తారు.
ఫిబ్రవరి 11న తిరుమలలో శ్రీ పురందరదాస ఆరాధనా మహోత్సవం
కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ పురందరదాస ఆరాధనా మహోత్సవం ఫిబ్రవరి 11న తిరుమలలో ఘనంగా జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేస్తారు.
అక్కడున్న శ్రీ పద్మావతి పరిణయ మండపంలో శ్రీ పురందరదాస ఆరాధనా మహోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రముఖ కళాకారులు శ్రీ పురందరదాస కీర్తనలను బృందగానం చేస్తారు.