శ్రీధర్మ పరిషత్ మహాసంస్థానం, చాణక్య మిత్రమండలి విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థ్థినీ, విద్యార్థులకు వివిధ అంశాలపై ఆన్‌లైన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ సమన్వయకర్త విష్ణుభట్ల జయప్రకాష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పద్యం, శతకాలకు సంబంధించి మూడు కేటగిరిల్లో జరిగే ఈ పోటీల్లో 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు చాణక్య నీతిచంద్రిక అనే అంశంపైన, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆంధ్రనాయక శతకం అనే అంశంపైన, ఇంటర్ ఆపైన విద్యార్థులకు సరస్వతీదేవి వర్ణన అనే అంశంపై అర్థసహితమైన పద్యాలు, శతకాలను చదువుతూ ఐదు నిమిషాలు నిడివి గల దృశ్యాన్ని చిత్రీకరించి
[email protected]కి మెయిల్ చేయాల్సి ఉంటుందన్నారు.
అలాగే పోటీల్లో పాల్గొనే విద్యార్థులు సంబంధిత అంశాలను కూడా ఆన్‌లైన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. మూడు కేటగిరిల్లోనూ గెలుపొందిన విజేతలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తామన్నారు. సరస్వతీదేవి వర్ణన అనే అంశంపై పాల్గొనే ఇంటర్ ఆపైన విద్యార్థులు మాత్రం 9393380220 వాట్సాప్ నెంబరుకు సందేశాన్ని పంపించడంతో పాటుగా ఆన్‌లైన్‌లో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే 7వ తరగతిలోపు విద్యార్థులు ఈ నెల 23వ తేదీలోగా, అలాగే 10వ తరగతిలోపు విద్యార్థులు ఈ నెల 24వ తేదీలోగా ఇంటర్ ఆపైన విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోగా వారు ఎంచుకున్న అంశంపై చిత్రీకరించిన వీడియోలను మెయిల్‌కి పంపించాల్సి ఉంటుందని తెలిపారు.
శ్రీధర్మ పరిషత్ మహా సంస్థానం వ్యవాస్థాపకులు అవ్వా హేమసుందర వరప్రసాద్ (రాజా) గారి సహకారం, పర్యవేక్షణ లో నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త విష్ణుభట్ల జయప్రకాష్ పేర్కొన్నారు.