'నన్ను క్షమించండి.. నేను చదవలేకపోతున్నా'.. ఒంగోలు రిమ్స్ మెడికో సూసైడ్
చదువుల ఒత్తిడిని తట్టుకోలేక మరో మెడికో బలవన్మరణానికి పాల్పడ్డాడు. 'నన్ను క్షమించండి.. నేను చదవలేకపోతున్నా.. మీరు కోరుకున్నట్లు నేను డాక్టర్‌ను కాలేనేమో' అంటూ తన మనసులోని ఆందోళనను సూసైడ్ లేఖలో బయటపెట్ట
చదువుల ఒత్తిడిని తట్టుకోలేక మరో మెడికో బలవన్మరణానికి పాల్పడ్డాడు. 'నన్ను క్షమించండి.. నేను చదవలేకపోతున్నా.. మీరు కోరుకున్నట్లు నేను డాక్టర్‌ను కాలేనేమో' అంటూ తన మనసులోని ఆందోళనను సూసైడ్ లేఖలో బయటపెట్టి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విద్యార్థి పేరు గుగులోత్ మనోకృష్ణ. వయసు 20 యేళ్లు.
ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. మరిపెడ మండలానికి చెందిన గుగులోతు నామ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, భార్య శోభ ఎంపీటీసీ సభ్యురాలు. వీరికి ఇద్దరు కుమారులుండగా, ఇద్దరినీ ఎంబీబీఎస్ చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు మనోజ్ నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి వద్ద ఉన్న కామినేని ఆస్పత్రిలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
చిన్న కుమారుడు మనోకృష్ణ ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు రిమ్స్ ప్రభు త్వ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతు న్నాడు. ప్రథమ సంవత్సరంలో కళాశాలలోనే 75 శాతం మార్కులతో 9వ ర్యాంక్ సాధించాడు. మనోకృష్ణ శనివారం ఇంటికి వచ్చాడు. అక్కడ ఏమైనా ఇబ్బందులున్నాయా? అని తండ్రి ప్రశ్నించగా.. అలాంటిదేంలేదన్నాడు. మనోకృష్ణ గురువారం సినిమా చూసి ఇంటికి వచ్చాడు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో మనో కృష్ణ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. తండ్రి ఇంటికి వచ్చి తలుపులు తెరవగా కొడుకు శవమై కనిపించాడు. విషయం పోలీసులకు చేరవేయగా వారు వచ్చిన గదిని పరిశీలించగా ఒక సూసైడ్ లేఖ లభించింది. ‘అన్నా.. మీ అందరినీ వదిలి వెళ్లాలని లేదు. కానీ, చదువుకోవడంలో నాకు నిర్లక్ష్యం ఉంది. నేను అనుకున్న ప్రకారం డాక్టర్‌ను కానేమో అనే అనుమానం తలెత్తింది.
దీంతో చాలా రోజులుగా నరకయాతన అనుభవించాను. చివరకు తప్పని సరి ఇక భూమిమీద ఉండొద్దనే ఆలోచనకు వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నా. ఇది తప్పే అని తెలిసి కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నా. ఇక అన్నీ నీవే.. అమ్మనాన్నలను జాగ్రత్తగా చూసుకో.. నాకు సాయి, వంశీ, రాజీ, సతీశ్, గోపీ, వసంత ఆంటీ కుటుంబసభ్యులుగా సహకరించారు. నేను ఎక్కడున్నా మీ హృదయాల్లో నిలిచి ఉంటాను. మిమ్మల్ని వదిలి తీసుకున్న ఈ నిర్ణయానికి నన్ను క్షమించాలని కోరుకుంటున్నా’ అని రాశాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.