Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పౌష్టికాహార మాసోత్సవాలు: మంత్రి తానేటి వనిత

ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పౌష్టికాహార మాసోత్సవాలు: మంత్రి తానేటి వనిత
, బుధవారం, 29 సెప్టెంబరు 2021 (22:28 IST)
మాతా శిశువులకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ సింగ్ నగర్ షాదీఖానాలో నిర్వహించిన పౌష్టికాహార అవగాహనా కార్యక్రమానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

షాదీఖానా ఆవరణలో దేవాదాయ శాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి శాసన సభ్యులు మల్లాది విష్ణు తదితరులతో కలిసి మంత్రి మొక్కలునాటారు.

అంగన్ వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారం విద్యకు సంబంధించిన అంశాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను తిలకించిన అనంతరం మల్లాది విష్ణు అధ్యక్షతన నిర్వహించిన అవగాహనా సదస్సులో మంత్రి తానే వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు గర్భందాల్చిననాటినుండి కాన్పు అయ్యేంతవరకూ అవసరమైన పౌష్టికాహారాన్ని అందించి
ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

పిల్లలకు మంచి ఆరోగ్యం వయస్సుకు తగ్గ ఎదుగుదలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు మహిళల ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి ఈఏడాది రూ. 1800 కోట్లరూపాయలను కేటాయించారన్నారు. గత ప్రభుత్వం కేవలం రూ. 500 కోట్ల రూపాయలను కేటాయించి మాతాశిశు సంక్షేమాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు.

అంగన్ వాడీ కార్యకర్తల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి మహిళలు చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై ఆరాతీసి వారికి అవసరమైన పౌష్టికాహారం అందించి ప్రజల మెరుగైన ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారన్నారు. గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ మిగిలిన ప్రాంతాలలో వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పధకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు పౌష్టికాహారంపట్ల అవగాహన కల్పించడానికి రాష్ట్రవ్యాప్తంగా మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
 
రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాతా శిశు సంక్షేమం కోసం నిర్వహిస్తున్న మాసోత్సవాలలో గర్భిణీలు బాలింతలు చిన్నారులు తీసుకోవాల్సిన పౌష్టికాహారం పై అవగాహన కల్పిస్తున్నారన్నారు. పౌష్టికాహారం తయారీ పై అంగన్ వాడీలలో మహిళలకు శిక్షణ అందించడం అభినందనీయం అన్నారు.

జగనన్న గోరుముద్ద ద్వారా అంగన్ వాడీ కేంద్రాలు పాఠశాలల్లో పిల్లలకు అందించే ఆహారంలో ఏవారం రోజున ఎటువంటి పౌష్టికాహారాన్ని అందించాలన్న విషయంపై స్వయంగా ముఖ్యమంత్రే మెనూను రూపొందించి అమలు పరచడం పట్ల
ఆయనలో చిన్నారుల ఆరోగ్యం పై ఉన్న శ్రద్ధ కు నిదర్శనం అన్నారు.

మాతాశిశువులకు మంచి పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా శిశు మరణాలను నియంత్రించి ఆరోగ్యవంతమైన శిశువులుగా ఎదగాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ గత ప్రభుత్వం అరకొర నిధులతో మాతా శిశువుల సంక్షేమం పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించిందన్నారు.

రక్త హీనతతో ఎవరూ బాధ పడకూడదని ముఖ్యంగా పేద బలహీన బడుగువర్గాల మహిళలకు మంచి ఆరోగ్యాన్ని అందించడంతో పాటు జన్మించిన బిడ్డలకు పౌష్టికాహారాన్ని అందించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసాంఘిక కార్యకలాపాలపై పటిష్ట నిఘా ఉంచాలి : డిజిపి మహేందర్ రెడ్డి