దళారులు లేకుండా వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో సమూల మార్పుల దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరు నెలల్లోగా దళారీ వ్యవస్థను నిర్మూలించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.
మార్కెటింగ్, సహకార శాఖలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. 50 శాతం మార్కెట్ ఛైర్మన్ పదవులు మహిళలకే కేటాయించాలని జగన్ నిర్ణయించారు. పంటలు వేసినప్పుడే వాటికి ధరలు ప్రకటించాలని స్పష్టం చేశారు. కనీస మద్దతుధర లేని పంటలకూ ధరలు ప్రకటించాలని సూచించారు.
అక్టోబర్ నెలాఖరు నాటికి చిరుధాన్యాలపై బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసే గిడ్డంగులపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల నష్టాలపై కమిటీని నియమించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
సహకార రంగంలో అవినీతి, పక్షపాతం ఉండరాదని ముఖ్యమంత్రి అన్నారు. ధరల స్థిరీకరణ, మార్కెట్లలో వసతులు, మిల్లెట్స్ బోర్డులపై వివరాలు అడిగిన సీఎం జగన్.. పప్పుధాన్యాల కొనుగోళ్ల కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. రాయలసీమ ప్రాంతాన్ని మిల్లెట్స్ హబ్‌గా మార్చాలని ఆదేశించారు.
సాగువిధానాలు, మార్కెటింగ్, ప్రాసెసింగ్ అన్నీ బోర్డు పరిధిలో ఉంచాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సమావేశానికి మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకటరమణతో పాటు సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.