Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమల పంచాయతీకి ఎన్నికల్లేవ్... ఎందుకో తెలుసా?

తిరుమల పంచాయతీకి ఎన్నికల్లేవ్... ఎందుకో తెలుసా?
, సోమవారం, 9 మార్చి 2020 (20:28 IST)
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల ఒక చిన్న పంచాయతీ అన్న విషయం తెలుసా? అయినా ఇప్పటి వరకూ ఈ పంచాయతీకి ఒక్కసారి కూడా ఎన్నిక జరగలేదు. తిరుమల ఓటర్లు కేవలం ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలకే పరిమితం. అందుకే రాష్ట్రమంతా ‘స్థానిక’ ఎన్నికల హడావుడి మొదలైనా తిరుమలలో మాత్రం ఆ పరిస్థితి కనిపించదు.
 
శ్రీవారు వెలసిన తిరుమల కొండను 1910 వరకు ‘తిరువేంగడం’ అని పిలిచేవారు. భక్తులు పెద్దసంఖ్యలో కొండకు తరలి రావడం దశాబ్దాల క్రితమే ఆరంభమైనా.. దట్టమైన అడవి కావడంతో సాయంత్రమైతే ఆలయ పరిసరాలు నిర్మానుష్యంగా మారేవి.

దీంతో ఈ క్షేత్రాన్ని నివాసయోగ్యంగా మార్చే ప్రయత్నంలో కొంతమంది కొండపైనే జీవించేలా చర్యలు తీసుకున్నారు. స్థానికులనే ఉద్యోగులుగా, పనివాళ్లుగా నియమించుకోవడంతో శ్రీవారి ఆలయం చుట్టూ గ్రామం ఏర్పడింది. తిరుమలలో 1910లో వంద ఉన్న స్థానికుల సంఖ్య ఆ తర్వాతి కాలంలో దాదాపు 30 వేలకు చేరింది. 
 
1975 వరకు చుట్టూ ఏర్పడిన నివాసగృహాల మధ్యనే శ్రీవారి ఆలయం ఉండేది. రద్దీ బాగా పెరగడంతో మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా మాడవీధులను విస్తరించారు. స్థానికులను ఇళ్లు ఖాళీ చేయించి వారికి కొండకింద తిరుపతిలో ఇళ్లు, ఇళ్లస్థలాలు ఇచ్చారు.

ఫలితంగా ప్రస్తుతం బాలాజీనగర్‌లో 1060, ఆర్‌బీ సెంటర్‌లో 81 ప్రైవేటు ఇళ్లు మాత్రమే మిగిలాయి. ఒకప్పుడు 30 వేల జనాభాలో 20 వేలుగా ఉన్న తిరుమల ఓట్లర సంఖ్య 2019 జాబితా ప్రకారం 5,164కి పడిపోయింది. 
 
తిరుమల పేరుకు గ్రామ పంచాయతీ అయినప్పటికీ ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరగవు. దేవదాయ శాఖ చట్టం కింద అలిపిరి నుంచి తిరుమల వరకు ప్రత్యేక ప్రదేశంగా పరిగణించారు. 1964లో టీటీడీ ఈవోగా బాధ్యతలు తీసుకున్న బీ నర్సింగరావ్‌నే పంచాయతీ అధికారిగా నియమించారు.

అప్పటి నుంచి టీటీడీ ఈవోనే తిరుమల పంచాయతీ అధికారిగా కొనసాగుతున్నారు. కొన్నేళ్ల క్రితం తిరుమలలోనూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని స్థానికులు కోర్టుకు వెళ్లినప్పటికీ న్యాయస్థానం ఆ కేసును కొట్టివేసింది. ప్రస్తుతం తిరుమలలో ఉంటున్న స్థానికులు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో మాత్రమే భాగస్వాముల అవుతున్నారు.

స్థానిక పాలన లేకపోవడంతో ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చాలాకాలంపాటు తిరుమలవాసులకు దక్కలేదు. ఈ దశలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాక తిరుమల స్థానికులకు సంక్షేమ పథకాలు అందించారు.

ఆ తర్వాత కొన్ని కారణాలతో వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను రద్దు చేసినా.. 2014లో ఏర్పడిన ప్రభుత్వం వారికి రేషన్‌తోపాటు పెన్షన్లు అందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసీపీలో చేరిన డొక్కా