Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల త్యాగం మరువలేనిది: ఎన్.ఎం.డి.ఫరూక్

రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల త్యాగం మరువలేనిదని శాసనమండలి చైర్మన్ ఎన్.ఎం.డి.ఫరూక్ కొనియాడారు. రిపబ్లిక్ డే సందర్భంగా శాసనసభ, మండలి ఉద్యోగులతో అసెంబ్లీలోని కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన సమావ

రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల త్యాగం మరువలేనిది: ఎన్.ఎం.డి.ఫరూక్
, శుక్రవారం, 26 జనవరి 2018 (17:40 IST)
•  శాసనమండలి చైర్మన్ ఎన్.ఎం.డి.ఫరూక్
• రాష్ట్రాభివృద్ధికి అందరమూ పునరంకితమవుదాం
• శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు
 
సచివాలయం, జనవరి 26 : రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల త్యాగం మరువలేనిదని శాసనమండలి చైర్మన్ ఎన్.ఎం.డి.ఫరూక్ కొనియాడారు. రిపబ్లిక్ డే సందర్భంగా శాసనసభ, మండలి ఉద్యోగులతో అసెంబ్లీలోని కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో కలిసి మాట్లాడారు. 
 
కుటుంబాలు హైదరాబాద్ లో ఉన్నా, సీఎం చంద్రబాబునాయుడు ఆశయ సాధనకు ఉద్యోగులు కష్టించి పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల త్యాగం మరువలేనిదన్నారు. 1950లో మద్రాసులో, 1953లో కర్నూలులో, 1956లో హైదరాబాద్‌లో, ఇప్పుడు అమరావతిలో గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. ప్రస్తుతం చట్ట సభల నిర్వహణ కష్టంగా మారిందని, అయినప్పటికీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నామని ఆయన అన్నారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా సీఎం చంద్రబాబునాయుడు అభివృద్ధి చేశారన్నారు. అంతకంటే ఎక్కువగా అమరావతిని సీఎం చంద్రబాబు అభివృద్ధి చేయడం ఖాయమన్నారు. 
 
రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుదాం...
ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తూ నవ్యాంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి పునరంకితమవుదామని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పిలుపునిచ్చారు. చట్ట సభలు సజావుగా పనిచేస్తేనే ప్రజాస్వామ్యం విజయవంతమవుతుందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేవి చట్ట సభలన్నారు. ప్రజాప్రతినిధులు తమ ప్రాంత సమస్యల పరిష్కారానికి చట్ట సభలను వేదికగా చేసుకుంటారన్నారు. పాలన సవ్యంగా సాగాలంటే ఉద్యోగుల సహకారం ఎంతో అవపరమన్నారు. 
 
రాష్ట్ర విభజన అసంపూర్తిగా జరిగిందన్నారు. చట్టసభలు ఎంత ముఖ్యమో దాంట్లో పనిచేసే ఉద్యోగుల సంక్షేమం కూడా ప్రభుత్వానికి అంతేముఖ్యమన్నారు. ఇప్పటికీ 60 శాతం సౌకర్యాలతోనే ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. త్వరలో అసెంబ్లీ, శాసనమండలి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంతో పాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ కూడా చేస్తామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. విధుల నిర్వహణలో ఉద్యోగులకు అన్ని రకాల సౌకర్యాలు  కల్పిస్తామన్నారు. త్వరలో కొత్త భవనం నిర్మించనున్నారన్నారు. 
 
ఆ భవనం అందుబాటులోకి వస్తే ఉద్యోగులకు ఎంతో వెసులుబాటు కలుగుతుందన్నారు. ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీలో ఉద్యోగుల పిల్లలకు ప్రాధాన్యమిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. స్వాతంత్ర్యమొచ్చి దేశానికి 71 ఏళ్ల కావస్తోందన్నారు. అభివృద్ధి పరంగా భారతదేశం దూసుకుపోతోందన్నారు. త్వరలో అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా అవతరించడం ఖాయమన్నారు. 
 
ఇందుకు దేశ ప్రజలంతా ఐక్యంగా కష్టపడి పనిచేయాలన్నారు. రాష్ట్ర విభజనతో అన్యాయం జరిగిందనే భావన రాష్ట్ర ప్రజల్లో నెలకొందన్నారు. ఆంధ్రపదేశ్ ప్రజలకు కష్టించే గుణం ఉందన్నారు. త్వరలోనే ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోవడం ఖాయమన్నారు. విదేశాల్లో ఉన్న ఆంధ్రులు కూడా కష్టపడుతూ, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తెస్తున్నారన్నారు. 
 
అనంతరం ఉద్యోగులకు హెల్త్ కార్డులను శాసనమండలి చైర్మన్ ఎన్.ఎం.డి.ఫరూక్, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అందజేశారు. సంక్రాంతి, రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు కూడా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనని చంద్రబాబు.. ఎందుకు...?