Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్నికల కమిషన్ కాదు.. నిమ్మగడ్డ కమిషన్ : ఏపీ మంత్రి కన్నబాబు

ఎన్నికల కమిషన్ కాదు.. నిమ్మగడ్డ కమిషన్ : ఏపీ మంత్రి కన్నబాబు
, బుధవారం, 28 అక్టోబరు 2020 (16:06 IST)
ఆంధ్రప్రదేశ్‌లో ఉండేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదని, అది నిమ్మగడ్డ కమిషన్ అని ఏపీ మంత్రి కన్నబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత అహం కోసం, ఇష్టాల కోసం ఎన్నికల సంఘాన్ని నిమ్మగడ్డ రమేశ్ నడుపుతున్నారని మండిపడ్డారు. 
 
ప్రభుత్వంతో చర్చించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలను రమేశ్ వాయిదా వేశారని... ఆయనేంటో అప్పుడే జనాలకు అర్థమైందన్నారు. కనీసం ముఖ్యమంత్రికి కూడా చెప్పకుండానే ఎన్నికలను వాయిదా వేశారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వాన్ని దెబ్బతీయడమే ఆయన లక్ష్యమని... అదే ఉద్దేశంతో ఉన్నవారికి ఆయన సహకరిస్తున్నారని ఆరోపించారు.
 
కాగా, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే అంశంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి అధికార పార్టీ డుమ్మా కొట్టింది. ఈ వ్యవహారంపై మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని దెబ్బ తీయాలనుకుంటున్న పార్టీలతో నిమ్మగడ్డ సమావేశం ఏర్పాటు చేశారని మండిపడ్డారు. 
 
ఏపీలో ఫ్యాక్షనిస్టు ప్రభుత్వం ఉందని విమర్శిస్తూ గతంలో కేంద్ర ప్రభుత్వానికి నిమ్మగడ్డ లేఖ రాశారని గుర్తుచేశారు. సీఎం జగన్‌కు వ్యక్తిగతంగా ఎవరిపైనా కోపం లేదన్నారు. వ్యవస్థల పనితీరుపైనే ఆయన ఆలోచిస్తున్నారని... ఎన్నికల కమిషన్ ఇలా పని చేయడం కొనసాగిస్తే... భవిష్యత్తులో అది ఆనవాయతీగా మారుతుందన్నారు. 
 
ఎన్నికల హామీలన్నింటినీ నెరవేర్చిన తాము ఎలక్షన్లకు ఎందుకు భయపడతామని ఎదురు ప్రశ్నించారు. ఒకవేళ ఎన్నికలను నిర్వహించేందుకు నిమ్మగడ్డ రమేశ్ సిద్ధమైతే... ఉన్నత స్థాయిలో చర్చించి ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. 
 
అయినా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుంటే ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని మంత్రి కన్నబాబు సందేహం వ్యక్తం చేశారు. గతంలో కరోనా వైరస్ బూచి చూపే కదా స్థానిక సంస్థల ఎన్నికలను అర్థాంతరంగా వాయిదావేశారు అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నష్టాలతో సర్వీసులను నడపలేం.. 72 రైళ్లకు ఉద్వాసన??