Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా విధుల్లో సర్కారు జోక్యం ... సీఐడీ కేసులు పెట్టి వేధింపులు : నిమ్మగడ్డ

మా విధుల్లో సర్కారు జోక్యం ... సీఐడీ కేసులు పెట్టి వేధింపులు : నిమ్మగడ్డ
, గురువారం, 3 సెప్టెంబరు 2020 (10:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోమారు వార్తలకెక్కారు. ముఖ్యంగా, ఎన్నికల సంఘం స్వతంత్రతను పూర్తిగా అణిచివేసేలా వ్యవహరిస్తోందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే, ఏపీ ప్రభుత్వం తమ విధుల్లో జోక్యం చెసుకుంటోందని, తమ సిబ్బందిని కేసులు పెట్టి వేధిస్తోందంటూ ఆరోపించారు. ఈ కేసులన్నీ కొట్టివేయాలని కోరుతూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా, ఈ వ్యవహారాలన్నింటిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు. 
 
నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సీఐడీ అధికారులు ఎస్‌ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి ఉపయోగించిన కంప్యూటర్‌ను, అందులోని డేటాను తీసుకెళ్లారని.. వారు స్వాధీనం చేసుకున్న వస్తువులన్నిటినీ తిరిగి ఇచ్చేలా ఆదేశాలివ్వాలని కోరారు. 
 
గతంలో తాను కేంద్రానికి రాసిన లేఖ వ్యవహారాన్ని తెలుసుకునేందుకు తమ కార్యాలయానికి వచ్చిన సీఐడీ అధికారులు.. ఆ విషయాన్ని పక్కనబెట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకే ఆసక్తి ప్రదర్శించారని ఆయన పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా, పని చేయని కంప్యూటర్‌ను ఫార్మాట్‌ చేసినందుకు సాంబమూర్తిని సీఐడీ అధికారులు వేధించడమేగాక.. సాక్ష్యాలను ధ్వంసం చేశారంటూ ఆయనపై తప్పుడు కేసు బనాయించారని తెలిపారు. కమిషన్‌ను, ఉద్యోగులను వేధించేందుకే ఆ కేసు పెట్టారని, ఈ కేసును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ఈ పిటిషన్‌లో హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సీఐడీ అదనపు డీజీ, కేంద్ర హోం శాఖ కార్యదర్శి తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
 
కాగా, సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సహాయ కార్యదర్శి సాంబమూర్తి కూడా హైకోర్టును ఆశ్రయించడంతో.. ఈ పిటిషన్లను కలిపి విచారించేలా తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చికెన్ తింటే కరోనా మాయమంటూ ప్రచారం.. కొండెక్కిన ధరలు!