Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు అఖిలపక్షంతో నిమ్మగడ్డ రమేష్ కీలక భేటీ

Advertiesment
నేడు అఖిలపక్షంతో నిమ్మగడ్డ రమేష్ కీలక భేటీ
, బుధవారం, 28 అక్టోబరు 2020 (07:46 IST)
స్థానిక సంస్థల ఎన్నికల అంశం ఏపీలో మరోసారి హీటెక్కుతోంది. కరోనా కారణంగా అప్పట్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు. వాయిదా నిర్ణయాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణకు దూకుడు పెంచారు.

మరోవైపు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ రమేష్ పదవీకాలం ముగిసేదాకా(వచ్చే ఏడాది మార్చి 31) ఎన్నికలు జరపకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం ఆల్‌పార్టీ నేతలతో నిమ్మగడ్డ రమేష్ ‌కుమార్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.
 
‌ఉదయం 10.40కి ఆల్‌పార్టీ సమావేశం :
బుధవారం ఉదయం 10.40 నిమిషాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తూ.. ప్రతినిధులను పంపాల్సిందిగా కమిషన్ లేఖలు పంపింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు ఎన్నికల కమిషన్ తీసుకోనుంది.

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ, సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ, బీజేపీ నుంచి పాక సత్యనారాయణ ఎన్నికల కమిషన్ సమావేశానికి హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేన, సీపీఎం, వైసీపీ ప్రతినిధులు హాజరయ్యే అంశం ఇంకా ఖరారుకాలేదు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనే మెజార్టీ పక్షాలు మొగ్గు చూపుతున్నాయి. ఎన్నికల నిర్వహణ కరోనా ఉధృతి కారణంగా ఇప్పుడు సాధ్యంకాదని ఇప్పటికే అధికార పార్టీ మంత్రులు తేల్చిచెప్పారు. ఇదిలా ఉంటే నవంబర్ 4వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.
 
నిమ్మగడ్డ సమావేశానికి వెళ్లడంలేదు : వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ
స్థానిక ఎన్నికలపై రాజకీయపార్టీలతో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సమావేశానికి ముందు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందో చదువుకుని ఈ సమావేశాలను నిర్వహిస్తే బాగుండేది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.. ఒక్కసారి ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది, తిరిగి ఈ ప్రక్రియను ప్రారంభించాలంటే రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలను తీసుకుని ఆ ప్రకారం ముందుకు వెళ్లాలని సుప్రీంకోర్టు చెప్పింది.

మరి ఎస్‌ఈసీ దీన్ని పరిగణలోకి తీసుకోకుండా,   ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా అని చీఫ్‌ సెక్రటరీ గాని, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సెక్రటరీ గాని ఇచ్చే అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా, ముందు రాజకీయపార్టీలను పిలవటంలోనే...  ఎస్‌ఈసీకి వేరే ఉద్దేశాలు ఉన్నాయని స్పష్టమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి వెళ్లటం అనేది సరికాదని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టంచేస్తోంది. 
 
 స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ∙సా«ధ్యాసాధ్యాల మీద చర్చ అంటూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మరో రాజకీయానికి తెరతీశారు. ఎందుకు ఈమాట అనాల్సి వస్తుందంటే.. ఒక రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు ఉన్నాయా? లేదా? అనేది ఆ రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీతోనూ, మొత్తంగా ప్రభుత్వంతో చర్చించి వారి అభిప్రాయం ప్రకారం నడుచుకోవాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఒక వంక వారి అభిప్రాయాలు ఏంటో తీసుకోకుండా, సుప్రీంకోర్టు తీర్పునుకూడా పట్టించుకోకుండా, రాజకీయ పార్టీలను పిలిచి, ఒన్‌ టు ఒన్‌ సమావేశం అంటూ పిలవడం కచ్చితంగా నిమ్మగడ్డ–చంద్రబాబు రాజకీయంలో భాగమే. 
 
రాష్ట్ర ప్రభుత్వంతోనే చర్చించకుండా రాష్ట్రంలో ఉనికే లేని, పోటీయే చేయని, ఒక్క ఓటు కూడా లేని రాజకీయపార్టీలను నిమ్మగడ్డ పిలిచారంటే దీని మర్మం ఏంటో మరో 24 గంటల్లోనే అందరికీ తెలుస్తుంది. 
 
రాష్ట్రంలో 3 కోవిడ్‌ కేసులు కూడా లేని రోజుల్లో ఏ రాజకీయ పార్టీలనూ అడిగి ఎన్నికలను వాయిదా వేశారో నిమ్మగడ్డ చెప్పాలి. ఇప్పుడు దాదాపు రోజుకు 3వేల కేసులు నమోదు అవుతున్న సమయంలో, ఒకసారి కోవిడ్‌ సోకిన వారికి రెండోసారి సోకుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించవచ్చా? అని రమేష్‌కుమార్‌ అడుగుతున్నారంటే దీనివెనుక ఆయన ఉద్దేశాలు ఏంటో, దీనివెనుక ఎవరున్నారో స్పష్టం అవుతుంది. 
 
వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వందకు వందశాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని సీట్లలో విజయం సాధిస్తుందని సంపూర్ణ విశ్వాసం మాకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికీ ఉంది. అయినా ఎన్నికల నిర్వహణ అంటే అందులో ఓటువేసే ఓటరు భద్రతను అంటే 3 కోట్ల ప్రజల భద్రతను,ఆ ఎన్నికల నిర్వహణలో పాల్గొనే టీచర్లు మొదలు ఉద్యోగ సోదర, సోదరీమణులు మొదలు, పోలీసులు వరకూ ప్రతి ఒక్కరి భద్రతకూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ బాధ్యత వహిస్తారా?
 
నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఎన్నికల వాయిదా తర్వాత 2 ఉత్తరాలు రాశారు. అందులో 2వ ఉత్తరంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మీద, మా పార్టీ అధ్యక్షుడి మీద అత్యంత తీవ్రమైన దిగజారుడు పద్ధతుల్లో వాడకూడని పదజాలాన్ని వాడి ఆరోపణలు చేశారు. తనకు ప్రాణభయం ఉందని, మా పార్టీది ఫ్యాక్షనిస్ట్‌ ధోరణి అని, గూండాలమని, సంఘవ్యతిరేక శక్తులు అంటూ లేఖలు రాసిన చరిత్ర నిమ్మగడ్డ రమేశ్‌ది.

అధికార పార్టీమీద ఇంత తీవ్రమైన అంసతృప్తి, పక్షపాతం, అసహనం, ద్వేషం, వ్యతిరేక అజెండా ఉన్న వ్యక్తి ఈ రోజు ఒక్కో పార్టీకి 10 నిమిషాలు అంటూ అజెండాతో సమావేశాన్ని పెడితే దానికి హాజరుకావటంకాని, సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ముందుకు వెళ్తున్న ఆయన ధోరణిని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తిరస్కరిస్తోంది.

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా కాకుండా హైదరాబాద్‌లో ఎవరూ గుర్తుపట్టకుండా స్టార్‌ హోటళ్లలో చీకటి సమావేశాలు జరిపే వ్యక్తిగా మాత్రమే రాష్ట్ర ప్రజలకు గుర్తున్నారని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మరోసారి స్పష్టంచేస్తోంది. ఎన్నికల నిర్వహణను ఒక పవిత్ర మైన రాజ్యాంగ కర్తవ్యంగా కాకుండా ఒక డ్రామాగా నిమ్మగడ్డ భావిస్తున్నారని చెప్తున్నాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రుడిపై నీటి జాడలు : గుర్తించిన నాసా 'సోఫియా'