Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ ప్రభుత్వంపై గవర్నర్‌కు నిమ్మగడ్డ ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

Advertiesment
Nimmagadda
, గురువారం, 7 డిశెంబరు 2023 (08:55 IST)
ఏపీలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆ రాష్ట్ర గవర్నర్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి, సిటిజన్ ఫర్ డెమొక్రసీ ఫోరం ప్రతినిధి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిధులను పార్టీ కార్యక్రమాలకు వినియోగించడం చట్ట విరుద్ధమని, దీన్ని అడ్డుకోవాల్సిన నైతిక బాధ్యత గవర్నర్‌కు ఉందని ఆయన కోరారు. ఈ మేరకు ఇతర ప్రతినిధులతో కలిసి ఆయన జగన్ సర్కారుపై ఫిర్యాదు చేశారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, "ప్రభుత్వం పార్టీ, రెండూ సమాంతర వ్యవస్థలు, ప్రభుత్వంపై పార్టీ ప్రభావం పడకూడదు. ప్రభుత్వ వనరులతో, ప్రభుత్వ సిబ్బందితో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం అనైతికం. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇటీవల జారీ చేసిన జీవో నెం.7 ద్వారా పబ్లిక్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ పెట్టి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. 
 
పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులు ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్రంలో అధికారిక కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు కలిపే నిర్వహిస్తున్నారు. ఎన్నికలు, సమీపిస్తున్న తరుణంలో వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత గవర్నరుపై ఉంది. అందుకే ఆయనను కలిసి రాజ్యాంగబద్ధపాలన జరిగేలా చూడాలని ఫిర్యాదు చేశాం. పారదర్శకమైన పాలన జరగాలని సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆశిస్తోంది" అని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండటం కూడా అనైతికమన్నారు. ఓట్లు తొలగించేటప్పుడు సంబంధిత వ్యక్తికి ముందుగా నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలన్నారు. పౌరుడు ఎన్నిక చేసుకున్న ప్రదేశంలోనే ఓటు హక్కు కల్పించాలని, నివాసం లేనంత మాత్రాన ఓటు హక్కు తొలగించకూడదని అభిప్రాయపడ్డారు. కేవలం బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌వో) ఫిర్యాదు మేరకు ఓటు హక్కు తొలగిస్తున్నారని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆరోపిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఆ మూడు జిల్లాలకు పెద్దపీట?