నెల్లూరు జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. కారుతో ఢీకొట్టించి దాడి చేసి ఆయనపై హతమార్చేలా ప్లాన్ చేశారు. అయితే, అదృష్టవశాత్తు ఆయన ఈ దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడటంతో పాటు కాలు కూడా విరిగింది. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ దాడికి పాల్పడిందికూడా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడు ప్రజయ్ స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి కావడం గమనార్హం. ప్రజయ్, రాజశేఖర్ రెడ్డిలు మంచి స్నేహితులు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో చాలాకాలంగా ఎడమొహం పెడమొహంగా ఉన్నారు.
అయితే, చాలా రోజుల తర్వాత శనివారం ప్రజయ్ ఇంటికి రాజశేఖర్ రెడ్డి మద్యం సేవించి వచ్చి, ప్రజయ్‌తో గొడవపడ్డాడు. దీంతో శ్రీనివాసులు రెడ్డి కల్పించుకుని వారిద్దరికీ సర్దిచెప్పి పంపించారు. బయటకు వెళ్లినట్టే వెళ్ళి వేచి చూసిన రాజశేఖర్ రెడ్డి.. శ్రీనివాసులు రెడ్డి బయటకు రాగానే ఆయన్ను కారుతో ఢీకొట్టించి పారిపోయాడు. గాయపడిన శ్రీనివాసులను కుటుంబ సభ్యులు ఆస్పత్రికితరలించారు.
కోటంరెడ్డికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. కారు విరిగినట్టు గుర్తించి వైద్యం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రాజశేఖర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ దాడిని టీడీపీ నేత నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. జగన్ రెడ్డిగారి మూడు రాజధానులకు తోడు క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా నెల్లూరును ప్రకటించినట్టుగా ఉందంటూ విమర్శించారు.