Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒకరిని విడిచి ఒకరు ఉండలేక... మరొకరితో కాపురం చేయలేక...

Advertiesment
ఒకరిని విడిచి ఒకరు ఉండలేక... మరొకరితో కాపురం చేయలేక...
, ఆదివారం, 31 జనవరి 2021 (14:56 IST)
నెల్లూరు జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. వేర్వేరు కులాలకు చెందిన ప్రేమ జంట నెల్లూరులోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకుంది. ఒకే చోట పనిచేస్తున్న వీరిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకునే ధైర్యం లేక, తమకు పెళ్లిళ్లు జరిగినప్పటికీ.. తమతమ భాగస్వాములతో కాపురం చేయలేక ఈ విషాదానికి పాల్పడ్డారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని దగదర్తి మండలానికి చెందిన ఈగ సుబ్రహ్మణ్యం, అరుణమ్మ దంపతులు నాయుడుపేటలో ఉంటున్నారు. వీరి పెద్ద కుమార్తె లావణ్య (26) ఇంజనీరింగ్‌ పూర్తి చేసి చిట్టమూరు మండలం మెట్టు సచివాలయంలో 2019లో వీఆర్వోగా పని చేస్తోంది. 
 
అలాగే, ఇందుకూరుపేట మండలం జేజేపేటకు చెందిన గురవయ్య, వెంకటరమణమ్మల చిన్నకుమారుడు హరీష్‌ (30) ఇంజనీరింగ్‌ పూర్తి చేసి గతేడాది జనవరిలో మెట్టు సచివాలయంలోనే అసిస్టెంట్‌ ఇంజనీరుగా ఉద్యోగంలో చేరాడు. ఒకేచోట లావణ్య, హరీష్‌లు పని చేస్తుండటంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. 
 
తమ ప్రేమవ్యవహారం పెద్దలకు చెప్పేందుకు వారికి కులాలు అడ్డొచ్చాయి. ఇద్దరు కుటుంబసభ్యులు ఆ ప్రేమికులిద్దరికి వేరే వారితో వివాహాలు నిశ్చయించారు. సైదాపురం సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న దగదర్తి వాసితో డిసెంబరు 11న లావణ్యకు, ప్రకాశం జిల్లా కందుకూరు మండలం మాచవరానికి చెందిన యువతితో డిసెంబరు 19న హరీష్‌కు వివాహాలు కూడా జరిగాయి.
 
పెళ్లిళ్లు జరిగినా ప్రేమను చంపుకోలేక, మరొకరితో కాపురం చేయలేక నెల రోజులుగా ఆ ప్రేమికులు మానసిక క్షోభను అనుభవించారు. అటు సమాజాన్ని ఎదురించలేక, ఇటు వివాహం చేసుకున్న వారితో ఉంటూ ప్రేమను చంపుకోలేక చావుతోనైనా ఇద్దరం ఒక్కటవుదామని నిశ్చయించుకున్నారు. 
 
దీంతో శుక్రవారం మధ్యాహ్నం నెల్లూరులోని సుందరయ్య కాలనీ శివారు ప్రాంతంలో ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. హరీష్‌, లావణ్యలు గదికి చేరుకుని తమ తల్లిదండ్రులకు ఓ ఉత్తరం రాశారు. 'దయచేసి మమ్మల్ని క్షమించండి ఇలా చేస్తున్నందుకు.. మా అవయవాలు దానం చేయండి' అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. 
 
ఆ తర్వాత తమతోపాటు తెచ్చుకున్న ఓ చున్నీతో స్లాబ్‌కు ఉన్న హూక్‌కు తగిలించారు. మరో చున్నీని తమ అరుపులు బయటకు రాకుండా ఇద్దరి నోటికి కట్టుకున్నారు. మొదట సిద్ధం చేసుకుని చున్నీని ఇరువైపులా తమ మెడలకు బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
 
శుక్రవారం రాత్రి లాడ్జిలో పని చేసే రూమ్‌బాయ్‌ గదిని శుభ్రపరిచేందుకు తలుపులు తట్టగా ఎవరూ స్పందించక పోవడంతో అనుమానంతో ఆ గది వెనుక ఉన్న కిటికీ తలుపును బలవంతంగా తెరిచి చూడగా ఇద్దరూ ఉరికి వేలాడుతూ కనిపించారు. 
 
దీంతో రూమ్‌బాయ్‌ లాడ్జి యజమానులకు సమాచారం అందించడంతో యాజమాన్యం బుకింగ్‌ రికార్డుల్లో ఉన్న మరో నెంబరుకు ఫోన్‌ చేసి మృతిరాలి తండ్రి సుబ్రహ్మణ్యంకు సమాచారం అందజేశారు.
 
ఆ వెంటనే శనివారం ఉదయం మృతురాలి తండ్రి లాడ్జి వద్దకు చేరుకొని వేదాయపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ, ఎస్‌ఐ పుల్లారెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకొని గది తలువులు పగలగొట్టి మృతదేహాలను కిందకు దించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుప్రీంకోర్టు డెడ్‌లైన్ : రాజీవ్ దోషుల విడుదలకు ఓకే.. గవర్నర్ ఏం చేస్తారో?