Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమలోనే కాదు.. మరణంలోనూ తోడుగా... గంటల వ్యవధిలో భార్యాభర్తల మృతి

ప్రేమలోనే కాదు.. మరణంలోనూ తోడుగా... గంటల వ్యవధిలో భార్యాభర్తల మృతి
, సోమవారం, 25 జనవరి 2021 (09:23 IST)
వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 20 యేళ్ళపాటు సంసారజీవితాన్ని అనుభవించారు. వారికి డిగ్రీ చదివే కుమారుడుతో పాటు.. ముచ్చటైన కుటుంబం కూడా ఉంది. ఈ ప్రేమ జంటకు కాలం గడిచిపోతున్నా.. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమానురాగాలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు అందుకేనేమో... మరణంలోనూ కలిసే పోయారు. గుండెపోటుతో భార్య తొలుత ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత భర్త కూడా గుండెపోటుతోనే చనిపోయాడు. ఈ విషాదకర ఘటన విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో శనివారం రాత్రి జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీకాకుళం జిల్లా అమదాలవలసకు చెందిన అర్ధంకి రాజమనోహర్‌ రావు (57) తనకు మేనకోడలు వరసైన సూర్య ప్రభావతి(48)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఎల్‌ఐసీ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌ విధుల్లో భాగంగా రాజమనోహర్‌ రావు తన కుటుంబంతో కలిసి 20 ఏళ్లుగా శృంగవరపుకోటలో నివాసం ఉంటున్నాడు. ఈ దంపతులకు డిగ్రీ చదువుతున్న కుమారుడు రామలిఖిత్‌లు ఉన్నారు. వీరితో పాటు.. సూర్యప్రభావతి చెల్లెలు ఎం తేజశ్రీ కూడా వీరితో కలిసి ఉంటోంది. 
 
ఈ క్రమంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో భార్య, భర్త మధ్య ఏదో విషయంలో వాగ్వాదం జరిగింది. దంపతులిద్దరికీ హైబీపీ ఉండటంతో తీవ్ర ఉద్రేకానికి లోనయ్యారు. వాగ్వాదం తర్వాత కోపంతో రాజమనోహర్‌రావు ఇంటి పై అంతస్థులోని తన గదిలోకి వెళ్లిపోయారు.
 
ఇంతలో సూర్య ప్రభావతి అస్వస్థతకు గురయ్యారు. దీన్ని గమనించిన కుమారుడు రామలిఖిత్‌ ఒక పక్క సపర్యలు చేస్తూ, మరో పక్క తండ్రికి సమాచారం ఇచ్చారు. ఆయన కిందకు వచ్చి ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు 108 వాహనానికి ఫోన్‌ చేశారు. వారొచ్చి చూసేటప్పటికే ఆమె మృతిచెందింది. 
 
భార్య మృతిని తట్టుకోలేని రాజమనోహర్‌రావు.. ఆ తర్వాత కొద్ది సేపటికే ఉన్నచోటే కుప్పకూలారు. క్షణాల్లోనే ప్రాణాలు విడిచాడు. రాజమనోహర్‌రావు ఐదేళ్లగా గుండె జబ్బు, చక్కెర వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు, ఎల్‌ఐసీ ఉద్యోగులు చెబుతున్నారు. గంట వ్యవధిలో భార్యాభర్త కన్నుమూయడంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హక్కుల పట్ల అవగాహనే ధ్యేయం: డాక్టర్ కృతికా శుక్లా