తిరుమలకు అలా వచ్చి ఇలా వెళ్లనున్న మోడీ .. ప్రత్యేకంగా సీఎం జగన్ భేటీ

ఆదివారం, 9 జూన్ 2019 (11:37 IST)
వరుసగా రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం రానున్నారు. ఆదివారం సాయంత్రం 3 గంటలకు కొలంబో నుంచి బయలుదేరే ఆయన సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకుంటారు. 
 
ఆ వెంటనే ఆయన మహాద్వారం కూడా శ్రీవారిని దర్శనం చేసుకుని తిరిగి రాత్రి 7.20 గంటలకెల్లా రేణిగుంటకు బయలుదేరుతారు. 8.10కి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకుంటారు. అంటే మోడీ పర్యటన కేవలం రెండు గంటల్లో పూర్తికానుంది. కాగా మోడీ పర్యటన సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోడీ వెంట కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉండనున్నారు. శనివారం నాడు రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల వరకూ ట్రయల్ రన్ నిర్వహించారు. 
 
మరోవైపు, తిరుమలకు వచ్చే ప్రధానితో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా తదితర అంశాలపై వీరిద్దరి మధ్యా చర్చ జరుగుతుందని సమాచారం. 
 
ముఖ్యంగా, కేంద్రం నుంచి రావాల్సిన రూ. 74,169 కోట్లు ఇవ్వాలని జగన్‌ వినతిపత్రాన్ని అందిస్తారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. ఇదేసమయంలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు కింద రావాల్సిన రూ.18,969 కోట్లు విడుదల చేయాలని జగన్‌ కోరనున్నారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో వీరిద్దరి భేటీ జరుగుతుందని తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఐదేళ్ళ బాలికపై అంకుల్ అత్యాచారం.. నదిలో శవం