ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా, పింఛన్ల పెంపుపై నారా లోకేష్ వరుస ట్వీట్లు చేశారు. అవ్వాతాతల్ని ఇంకా ఎంత కాలం మోసం చేస్తారు జగన్ రెడ్డిగారూ అంటూ.. ప్రశ్నించారు.
పెన్షన్ మూడువేలకు పెంచుకుంటూ పోతామని.. రూ.250 పెంచి ఆగిపోయారు. ఒకటో తారీఖునే తలుపులు ఇరగ్గొట్టి మరీ పెన్షన్ గడపకే ఇస్తామన్న ప్రగల్భాలు ఏమయ్యాయి? ఈ రోజు 1వ తేదీ.. 5 లక్షల మందికి పైగా పింఛన్లు అందలేదని గుర్తుచేశారు.
ప్రతీనెలా టెక్నికల్ ప్రాబ్లమేనా? అప్పు దొరకడంలేదా? మీకు ఇవ్వాలనే మనసుండాలే కానీ, మీ దగ్గరే లక్షల కోట్లు మూలుగుతున్నాయి. వాళ్లనీ, వీళ్లనీ అప్పులు అడగడం ఏమీ బాలేదు. ఒక్క నెల జే ట్యాక్స్‌లో 10 శాతం వెచ్చిస్తే అందరికీ పింఛన్లు ఇచ్చేయొచ్చు కదా అని అడిగారు.
క్విడ్‌ప్రోకో ద్వారా కూడగట్టిన అక్రమాస్తులలో ఒక్క శాతం అమ్మితే ఏపీ అప్పులన్నీ తీరిపోతాయి. పింఛన్లు లేటు చేస్తే, పెంపు గురించి అడగరనే లాజిక్‌తో పింఛన్ ఇచ్చే ఒకటో తేదీని అలా అలా పెంచుకుంటూ పోతున్నారా జగన్ రెడ్డి గారు! అంటూ లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.