ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు విమర్శలు సంధించారు. 'విజన్ ఉన్న లీడర్‌కు, ఒంటి నిండా పాయిజన్ ఉన్న లీడర్‌కు తేడా ఇదేనంటూ' పట్టిసీమ ప్రాజెక్టు నేపథ్యంలో వ్యాఖ్యలు చేశారు.
విజన్ ఉన్న లీడర్ రాబోయే సంక్షోభాన్ని ముందే పసిగట్టి నివారణ చర్యలు తీసుకుంటారని, పట్టిసీమ ప్రాజెక్టు అలాంటి ఆలోచన నుంచి పుట్టిందేనని వెల్లడించారు. ఇక ఒంటినిండా పాయిజన్ ఉన్న లీడర్ ముందు చూపు లేక, వరదలు వచ్చినా వినియోగించుకోలేక, ప్రజల్ని ముంచి నీటిని సముద్రం పాలుచేస్తారని విమర్శించారు.
ఎగువ రాష్ట్రాల నుంచి ఎంత వరద వచ్చినా సద్వినియోగం చేసుకోలేక, చివరికి పనికిరాని పట్టిసీమ అన్నవాళ్లే మోటార్లు ఆన్ చేసి నీటిని అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. కాగా, గత కొన్ని రోజులుగా నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా చాలా యాక్టివ్‌గా ఉన్న విషయం తెల్సిందే.