మహానాడుకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ద్వారా, ఆయన మహానాడు ఉత్సాహం, ప్రాముఖ్యతను ప్రజలతో పంచుకోవడానికి ప్రయత్నించారు. మొదటి రోజు జరిగిన కీలక ఘట్టాలను హైలైట్ చేశారు. మహానాడును కేవలం కార్యక్రమం కాదని.. గొప్ప తెలుగు వేడుకగా నారా లోకేష్ అభివర్ణించారు.
అంతకుముందు, మహానాడు సభలో ప్రసంగిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు కుల, మత, ప్రాంతీయ సరిహద్దులకు అతీతంగా ఎదగడం, అన్ని రంగాలలో ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలవడం తమ ఎజెండా అని నారా లోకేష్ అన్నారు. ఈ లక్ష్యం కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలుగుదేశం పార్టీ యువతకు గణనీయమైన ప్రాధాన్యత ఇస్తుందని నారా లోకేష్ ప్రకటించారు. పార్టీలో సీనియర్లను గౌరవిస్తూనే, జూనియర్లకు కూడా మద్దతు ఇస్తామని, అంకితభావంతో పనిచేసే ప్రతి వ్యక్తిని ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం బలమైన యువశక్తిని కలిగి ఉందని, సరైన అవకాశాలు కల్పిస్తే వారు అద్భుతమైన విజయాన్ని సాధించగలరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని రంగాలలో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం "యువగళం" ప్రాథమిక లక్ష్యం అని ఆయన పునరుద్ఘాటించారు.