ఆదాయపన్ను రిటర్నుల దాఖలుకు సంబంధించిన ఆదాయపన్ను శాఖ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. 2025-26 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలు గడువును పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ గడువు 2025 జూలై 31వ తేదీ ముగియాల్సి ఉండగా ఇపుడు దానిని సెప్టెంబరు 15 వరకు పొడగించింది.
ఐటీఆర్ ఫారాల నోటిఫికేషన్‌ను జారీచేయడంలో కొంత జాప్యం జరగడం ఈ గడువు పొడగింపునకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ విషయంపై ఆదాయపన్ను శాఖ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది.
"2025-26 మదింపు సంవత్సరానికి నోటిఫై చేసిన ఐటీఆర్ ఫారాల్లో చేపట్టిన మార్పులకు అనుగుణంగా సిస్టమ్‌ను సిద్ధం చేయడానికి కొంత సమయం అవసరం. పన్ను చెల్లింపుదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా రిటర్నులు ఫైల్ చేసేందుకు వీలుగా జూలై 31వ తేదీతో ముగియనున్న గడువును సెప్టెంబరు 15వ తేదీ వరకు పొడగిస్తున్నాం" అని ఆ ప్రకటనలో ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది.