అనంతపురంలో ఎం జరిగిందో ప్రపంచం మొత్తం చూసిందని, విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సిన వైసీపీ మంత్రులు ఎం మాట్లాడుతున్నారో విన్నారా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. జగన్ రెడ్డి ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి అని, ఈ మాట నేను ఊరికే అనడం లేదన్నారు. విద్యార్థి సంఘాల ముసుగులో దుండగులు పోలీస్ డ్రెస్ వేసుకొని విద్యార్థుల పై దాడి చేసారట... ఇదీ సీఎం చెప్పే మాట అని ఎద్దేవా చేశారు.
ఇంకో మంత్రి అసలు అక్కడ పోలీసులే లేరు విద్యార్థులే కొట్టుకొని తలలు పగలగొట్టుకున్నారని అంటున్నారని, ఇలాగే వదిలేస్తే అసలు అనంతపురంలో ఎస్.ఎస్.బి.ఎన్ కాలేజ్ లేదు... దాడి ఎప్పుడు జరిగింది అంటారు అని పరిహాసం చేశారు. అందుకే జగన్ రెడ్డి మూర్ఖపు ముఖ్యమంత్రి, మంత్రులు కంత్రీలు అని తాను అంటున్నా అని నారా లోకేష్ అన్నారు రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా దానికి జగనన్న అని పేరు పెట్టుకుంటున్నారు...చెత్త బళ్లకు కూడా వైకాపా రంగులు జగనన్న చెత్త బళ్లు అని పేరు పెట్టాలన్నారు. కానీ ఎయిడెడ్ కళాశాలపై జగన్ రెడ్డి విధ్వంసం చూసిన తరువాత ఆయన కార్యక్రమాలకు ఒక పేరు పెట్టాలనిపించిందని, జగనన్న కాదు జగన్ దున్న అని పేర్కొన్నారు. దున్న ఎం చేస్తుంది? వెంటపడి తరుముతుంది, కుమ్మేస్తుంది, అడ్డుగా ఉన్నవాటిని నాశనం చేస్తుంది. జగన్ రెడ్డి ఒక దున్నలా ఎయిడెడ్ విద్యా సంస్థల పై పడ్డాడు. వాటిని విధ్వంసం చెయ్యడానికి ప్రయతిస్తున్నారు. జగన్ రెడ్డి బ్లడ్ లో డేవలప్మెంట్ లేదు మొత్తం డిస్ట్రక్షనే అని లోకేష్ అన్నారు.
1854 లోనే ఎయిడెడ్ వ్యవస్థ ఏర్పడిందని, పేద విద్యార్థులకు అండగా నిలబడటానికి దాతలు, ప్రభుత్వాలు ముందుకు వచ్చాయని లోకేష్ వివరించారు. ఎన్టీఆర్, వెంకయ్యనాయుడు, జస్టిస్ రమణ, బలయోగి, ఆఖరికి జగన్ రెడ్డి తండ్రి వైఎస్, రోశయ్య ఇలా చెప్పుకుంటూ పోతే, ఎంతో మంది ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేసి ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. నెలలో మొదటి తేదీన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు జీతాలు ఇచ్చిన ఘనత చంద్రబాబుదని, రత్నకుమారి కమిటీ ఎవరితో మాట్లాడకుండానే రిపోర్ట్ ఇచ్చిందని, ఇపుడు జిఓ 42 తెచ్చి ఎయిడెడ్ ని చంపాలని చూస్తున్నారని లోకేష్ చెప్పారు.
రెండే అప్షన్లు ఇచ్చారు. ఒకటి ఉపాధ్యాయులను, ఆస్తులను ప్రభుత్వానికి ఇవ్వడం. రెండు ప్రైవేటీకరణ, జిఓలో లేని మూడో అప్షన్ ఉందని చెబుతున్నారు. ఇష్టం లేకపోతే ప్రభుత్వ ఎయిడ్ కొనసాగిస్తాం అని చెబుతున్నారు. ఆ ప్రస్తావన జిఓ లో ఎందుకు లేదని లోకేష్ ప్రశ్నించారు. మేనమామగా ఉంటానన్న జగన్ రెడ్డి కంసమామగా మారిపోయారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముద్దులు. అధికారంలోకి వచ్చాకా పిడి గుద్దులు ఇస్తున్నారని చెప్పారు. విద్యార్థుల పై లాఠీఛార్జ్ చేయించే స్థాయికి జగన్ రెడ్డి దిగజారిపోయారని, రాజారెడ్డి రాజ్యాంగంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు.