గత పక్షంరోజులుగా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎర్రబాలెం వద్ద రైతులు చేస్తున్న ధర్నాలో బాబు సతీమణి నారా భువనేశ్వరి స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యమ ఖర్చుల కోసం తనచేతికున్న ప్లాటినం గాజును తీసి ఇచ్చారు. ఆ తర్వాత ఎర్రబాలెం గణేశ్‌మందిర్ సెంటర్‌లో నిత్యం ధర్నాలు, వంటావార్పు చేస్తున్న రైతుల శిబిరాన్ని బుధవారం ఆమె సందర్శించారు. తనవంతు సాయంగా ప్లాటినంగాజును ఇచ్చారు.
ఈ గాజును వేలం వేసి వచ్చిన సొమ్మును ఉద్యమానికి వాడాలని రైతుల తరపన ఆకుల ఉమమహేశ్వరరావుకు అందజేశారు. ఈ ఘటనతో మరికొంతమంది స్ఫూర్తిని పొంది అప్పటికప్పుడు సుమారు రూ.50 వేల మేర ఎర్రబాలెం రైతులకు నగదు విరాళాలు అందించారు. ఈ సందర్భంగా రైతుల శిబిరాన్ని ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడారు. 'రాజధాని అమరావతి రక్షణ కోసం రైతులు సాగిస్తున్న ఉద్యమం విజయవంతమయ్యేందుకు జీవితాలనైనా ధారపోసేందుకు మా కుటుంబమంతా సిద్ధంగా ఉంది. రాష్ట్రాన్ని చంద్రబాబు దేశంలోనే నంబరు వన్‌గా తీర్చిదిద్దేందుకు నిత్యం తపించేవారు.
పోలవరాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు కంకణం కట్టుకుని పనిచేశారు. భోజనం చేసేటప్పుడు, నిద్ర పోయేటప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్, అమరావతి అనే కలవరించేవారు. తరచుగా విసుగొచ్చి 'మీరు ఆరోగ్యమంతా చెడగొట్టుకుంటున్నారు. మమ్మల్ని కూడా మర్చిపోతున్నారు' అని అనేదాన్ని. మీరే ఆయన మనసులో ఉన్న మొదటి వ్యక్తులు. మీ తర్వాతే ఆయనకు మా కుటుంబం.
ఇక్కడ రాజధానికి భూములిచ్చి రైతులుగా మీరు పడుతున్న ఈ బాధలు చూస్తుంటే నాకెంతో జాలేస్తుంది. ఓ సాటి మహిళగా ఇక్కడి మహిళల ఆవేదనను అర్థం చేసుకుంటున్నాను. మీ ఉద్యమంలో చంద్రబాబుతో పాటు మేమూ భాగస్వాములమవుతాం' అంటూ ఆందోళన చేస్తున్న రైతులకు భువనేశ్వరి భరోసా ఇచ్చారు.