కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు. దీంతో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి స్వయంగా మారెడ్డి లతారెడ్డికి ఫోన్ చేసి అభినందించారు. 'లతగారూ.. మీరు సాధించిన విజయం పట్ల మేమెంతో హ్యాపీగా ఉన్నాం' అని అన్నారు. అందుకు లతారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 'థ్యాంక్యూ అమ్మా.. నా విజయానికి మీరు కూడా కారణం అమ్మా... అందరూ కలిసికట్టుగా కృషి చేశారమ్మా' అంటూ వినమ్రయంగా బదులిచ్చారు.
అందుకు నారా భువనేశ్వరి స్పందిస్తూ, అవును ఈ విజయం అందరిదీ. ప్రతి ఒక్కరిదీ, అయినా పులివెందులలో గెలుపు అంటే ఇంకొంచెం జోష్ ఎక్కవ కదా. మీకు మరొక్కసారి శుభాభినందనలు. మనందరం ఒకే కుటుంబం అని అన్నారు. మీరు ఫోన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా.. జై తెలుగుదేశం అంటూ లతా రెడ్డి బదులిచ్చారు.
30 యేళ్ల తర్వాత పులివెందుల ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేశారు : నారా లోకేశ్
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి చెందిన ప్రజలు 30 యేళ్ల తర్వాత స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రాలకు వచ్చిన తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం చేపట్టారు. ఈ ఫలితాల్లో అధికార టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ముఖ్యంగా, పులివెందులలో పోటీ చేసిన వైకాపా అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ ఫలితంపై నారా లోకేశ్ స్పందించారు.
దాదాపు 30 యేళ్ల తర్వాత పులివెందులలో తొలిసారిగా నిజమైన ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరిగాయని, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఇది ఎంతో కష్టపడి సాధించిన విజయమని ఆయన అభినందించారు. పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు తిరోగమనాన్ని కాదని, పురోగతికి పట్టం కట్టారన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థుల విజయం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుందన్నారు.
స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన మారెడ్డి లతారెడ్డి, ముద్దుకృష్ణా రెడ్డిలకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓట్లు వేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజల మద్దతుతోనే ఈ విజయం సాధ్యమైందని నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు.