Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోటప్పకొండపై నంది విగ్రహం అపహరణ... ఎందుకో తెలుసా...?

నరసరావుపేట : ప్రఖ్యాత శైవక్షేత్రం కోటప్పకొండలో నంది విగ్రహాన్ని అగంతకులు అపహరించుకుపోయారు. గుప్త నిధుల కోసం నంది విగ్రహాన్ని పెకిలించి అపహరించుకుపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగి ఉంటుందని భక్తులు చెపుతున్నారు. వివరాలు ఇలా

కోటప్పకొండపై నంది విగ్రహం అపహరణ... ఎందుకో తెలుసా...?
, శనివారం, 26 నవంబరు 2016 (14:00 IST)
నరసరావుపేట : ప్రఖ్యాత శైవక్షేత్రం కోటప్పకొండలో నంది విగ్రహాన్ని అగంతకులు అపహరించుకుపోయారు. గుప్త నిధుల కోసం నంది విగ్రహాన్ని పెకిలించి అపహరించుకుపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగి ఉంటుందని భక్తులు చెపుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కోటప్ప కొండ బ్రహ్మ, రుద్ర, విష్ణు శిఖరాలుగా ప్రసిద్ది చెందింది. రుద్ర శిఖరంపై పాత కోటేశ్వర స్వామి ఆలయం, బ్రహ్మ శిఖరంపై మేథాదక్షణామూర్తి ఆలయం, విష్ణు శిఖరంపై పాపవిమోచనేశ్వర స్వామి ఆల యం ఉంది. 
 
ఈ ఆలయంలో రెండు నంది విగ్రహాలు వున్నాయి. ఒక విగ్రహాన్ని నెల రోజుల క్రితమే అపహరించుకు పోయారని భక్తులు తెలిపారు. ప్రతి నెల ఏకాదశి రోజు భక్తులు పాప విమోచనేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అభిషేకాలు చేస్తారు. గురువారం కూడా ఏకదశి ఉండటంతో కోటప్పకొండ చుట్టు పక్కల ప్రాంతాల భక్తులు స్వామికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో నంది విగ్రహం ఉంది. 
 
శుక్రవారం ఉదయం కూడా పాపవిమోచనేశ్వర స్వామికి అభిషేకం చేసేందుకు సదరు భక్తులు ఆలయానికి వెళ్ళారు. ఆలయంలో నంది విగ్రహం లేకపోవటంతో ఆందోళన చెందారు. ఆలయం దాదాపు కొండపై భాగంలో ఉంది. ఇక్కడికి వెళ్ళేందుకు కాలి బాట కూడా సరిగా ఉండదు. కొండపై నుంచి నంది విగ్రహాన్ని కిందకు తరలించినట్టుగా ఆనవాళ్ళను భక్తులు గుర్తించారు. నంది విగ్రహానికి తెల్ల రంగు వేసి ఉంటుందని వారు తెలిపారు. నంది విగ్రహాన్ని తరలించే సమయంలో కొండరాళ్ళకు తెల్ల రంగు అయినట్టు వారు గుర్తించారు. 
 
కొండ దిగువకు తరలించిన అనంతరం నంది విగ్రహాన్ని వాహనాలలో అగంతకులు తరలించినట్టుగా భావిస్తున్నారు. నెల రోజుల క్రితం ఈ నంది విగ్రహానికి ఒక పక్కన రాయిని కట్‌ చేశారు. ఇది ఆకతాయిల పనిగా భక్తులు భావించారు. కట్‌ చేసిన రాయిని తీసుకు వెళ్ళి అగంతకులు పరీక్ష చేయించిన అనంతరమే విలువైన రాయితో నంది విగ్రహం చేసి ఉండటం వలనే దీనిని తరలించుకు పోయి ఉండవచ్చునని భక్తులు భావిస్తున్నారు. ఈ నంది విగ్రహం అతి పురాత నమైనది. పురాతన కాలంలో విగ్రహాల ప్రతిష్ఠ సందర్భంగా బంగారం, విలువైన వస్తువులను ఉంచుతారు. 
 
వీటి కోసమైనా నంది విగ్రహాన్ని తవ్వి తరలించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రస్తుత ఆలయంలో పలు విగ్రహాలు కూడా అపహరణకు గురైన విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన అగంతకులు అప్పట్లో చిక్కారు. గతంలో సోపాన మార్గ ప్రాంతంలో యువకుడి హత్య కూడా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసు అవుట్‌ పోస్టు, పోలీసు గస్తీ ఉంటుందని పోలీసు శాఖ ప్రకటించింది. ఇవేవీ ఆచరణలో లేకపోవటం వలనే అగంతకులు సునాయాసంగా నంది విగ్రహాన్ని అపహరించుకు పోగలిగారని భక్తులు ఆరోపిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ‌బ‌రిమ‌ల‌కు 98 ప్ర‌త్యేక‌ రైళ్లు... ఆదివారం నుంచి రిజర్వేషన్ అందుబాటులోకి...