ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభ రోజునే అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన కె.నాగబాబు తొలిసారి అసెంబ్లీకి వచ్చారు. ఆయన శాసనమండలిలో అడుగుపెట్టేముందు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు, తన సొంత తమ్ముడైన పవన్ కళ్యాణ్‌ను ఆయన చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సందర్భంగా మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సమస్యల ప్రస్తావన వంటి పలు అంశాలపై నాగబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.
కాగా, రాష్ట్రంలో ఇటీవల ఖాళీ అయిన ఐదు శాసనసభ స్థానాల్లో కూటమి ఒప్పందంలో భాగంగా జనసేన పార్టీకి ఒకస్థానం కేటాయించారు. ఆ స్థానం నుంచి తన అన్న నాగబాబును పవన్ కళ్యాణ్ శాసనమండలికి పంపించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారి మండలి సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్న నాగబాబు, తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.