కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామికి అనేక చోట్ల అపారమైన అస్తులున్నాయి. ఈ ఆస్తుల విక్రయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తిరుమల తిరుమతి శ్రీవారి ఆస్తులను టీటీడీ అమ్మకానికి పెట్టడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
తమిళనాడులోని పలు జిల్లాల్లో 23 చోట్ల ఉన్న ఆస్తుల వేలానికి అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై జనసేన నేత నాగబాబు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఏడు కొండల వాడా వెంకట రమణా.. గోవిందా గోవిందా. ప్రజలతో పాటు నీ ఆస్తులు కూడా రక్షించుకో స్వామి' అని ఆయన ట్వీట్ చేశారు.
కొన్ని రోజులుగా నాగబాబు పలు అంశాలపై స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా, ఆస్తులు వేలం వేయాలనుకుంటున్న టీటీడీ చర్యలను ప్రతిపక్ష నేతలంతా తీవ్రంగా తప్పుబడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు.
కాగా, తితిదేకి దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్థలాలు ఉన్నాయి. ఇందులోభాగంగా, తమిళనాడులోని కాంచీపురం, వేలూరు, కోయబంత్తూరు, విల్లుపురం, నాగపట్నం, తిరువణ్నామలై తదితర జిల్లాల్లో ఉన్నాయి.