Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీ ఇల్ల‌యితే ఇలాగే వ‌దిలేస్తారా... ముఖేష్ కుమార్ మీనా ఆగ్రహం...

మీ ఇల్ల‌యితే ఇలాగే వ‌దిలేస్తారా... ముఖేష్ కుమార్ మీనా ఆగ్రహం...
, బుధవారం, 17 జులై 2019 (21:48 IST)
గిరిజ‌న సంక్షేమశాఖ వ‌స‌తి గృహాల‌ను పూర్తి స్దాయిలో ఆధునీక‌రించేందుకు ప్ర‌భుత్వం సిద్దంగా ఉంద‌ని రాష్ట్ర గిరిజ‌న సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. గిరిజ‌న విద్యార్ధుల‌కు విద్య‌తో పాటు ఆరోగ్యం కూడా అత్యావ‌శ్య‌క‌మ‌ని ఈ నేప‌ధ్యంలో పూర్తి స్దాయి ఆరోగ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హింప‌చేసేందుకు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక అమ‌లు చేయ‌నున్నామ‌న్నారు. ఇప్ప‌టికే ఆదివాసీ ఆరోగ్యం పేరిట విద్యార్దుల ఆరోగ్య ర‌క్ష‌ణ కోసం నిధులు విడుద‌ల చేస్తున్నామ‌ని, మ‌రింత మెరుగైన సేవ‌లు ఏలా అందించాల‌న్న దానిపై ప్ర‌త్యేక అధ్య‌య‌నం చేస్తున్నామ‌ని తెలిపారు. 
 
భ‌విష్య‌త్తులో పాఠ‌శాల‌ల స‌మూహాల‌కు ఒక వైద్యుడిని కూడా అందించే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని, ప్ర‌స్తుతం ఎఎన్ఎం సేవ‌లు వారికి అందుతున్నాయ‌ని తెలిపారు.  ప్ర‌తి ప‌ది మంది విద్యార్దుల‌కు ఒక మ‌రుగుదొడ్డి, ముఫై మంది విద్యార్దుల‌కు త‌ర‌గ‌తి గ‌ది ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, ఏ పాఠ‌శాల నుండైన అద‌న‌పు గ‌దుల ప్ర‌తిపాద‌న వ‌స్తే ఆమోదించేందుకు ప్ర‌భుత్వం సిద్దంగా ఉంద‌ని తెలిపారు. గురువారం కృష్ణాజిల్లాలోని కొండ‌ప‌ల్లి, నందిగామ గిరిజ‌న బాలిక‌ల వ‌స‌తి గృహాల‌ను కార్య‌ద‌ర్శి త‌నిఖీ చేసారు. త‌ర‌గ‌తి గ‌దుల మొద‌లు, వంట‌శాల‌, మ‌ర‌గుదొడ్ల వ‌ర‌కు నిశితంగా ప‌రిశీలించిన మీనా అక్క‌డి సిబ్బంది నిర్ల‌క్ష్యం పై మండిప‌డ్డారు.
 
అప‌రిశుభ్రంగా ఉన్న మ‌రుగుదొడ్లు నిర్వ‌హ‌ణ‌పై తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేసారు. మీ ఇంట్లో ఇలాగే ఉంటాయా అంటూ మంద‌లించారు. మ‌రోసారి వ‌స్తాన‌ని, అప్ప‌టికి ప‌రిస్దితుల‌లో మార్పు లేకుంటే ఇంటికి పంపుతాన‌ని స్ప‌ష్టం చేసారు. చిన్నారుల‌కు ఎటువంటి ఆహారం పెడుతున్నార‌న్న దానిని అరా తీసిన కార్య‌ద‌ర్శి స్వ‌యంగా రుచి చూసారు. ప‌రిస్దితులు మెరుగు ప‌డాల‌ని, త‌మ త‌ల్లి దండ్రుల‌కు దూరంగా విద్యార్జ‌న కోసం వ‌స‌తి గృహాల‌లో ఉన్న చిన్నారుల‌ను వార్డెన్లు త‌మ పిల్ల‌ల మాదిరే చూసుకోవాల‌ని ఆదేశించారు. 
 
కొండ‌ప‌ల్లి వ‌స‌తి గృహంలో నూత‌నంగా నిర్మితమ‌వుతున్న మొద‌టి అంత‌స్దును ప‌రిశీలించి, నిర్ణీత స‌మయంలో ప‌నులు పూర్తి కావాల‌ని ఇంజ‌నీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. సివిల్ ప‌నుల‌లో ఆల‌స‌త్వం వ‌ల్ల నిర్మాణ వ్యయం పెరిగి ప్ర‌భుత్వంపై భారం ప‌డుతుంద‌న్నారు. నందిగామ సంక్షేమ వ‌స‌తి గృహం నిర్వ‌హ‌ణ ప‌ట్ల తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేసిన ఆయ‌న అక్క‌డి వార్డెన్, ప్ర‌ధానోపాధ్యాయురాలిపై  మండిప‌డ్డారు.
webdunia
 
చిన్నారుల‌కు అన్ని స‌క్ర‌మంగా అందుతున్నాయా లేదా అన్న విష‌యాన్ని అరా తీయ‌గా, త‌మ‌కు ఇంకా ఏక‌రూప దుస్తులు రాలేద‌ని, అన్ని ర‌కాల పుస్త‌కాలు ఇవ్వ‌లేద‌ని కార్య‌ద‌ర్శి దృష్టికి తీసుకువ‌చ్చారు. ఏక‌రూప దుస్తులు ఆప్కో నుండి స‌ర‌ఫ‌రా కావ‌ల‌సి ఉంద‌ని, పుస్త‌కాలు త్వ‌ర‌లోనే ఇస్తార‌ని వివ‌రించారు. ఇక్క‌డ చిన్నారుల‌కు ఆట‌స్ధ‌లం లేని విష‌యం మీనా దృష్టికి రాగా, ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చూడాల‌ని, అద‌న‌పు గ‌దుల నిర్మాణానికి ప్ర‌తి పాద‌న‌లు సిద్దం చేయాల‌ని సూచించారు. 
 
చిన్నారులు భ‌విష్య‌త్తులో ఏమి అవుతార‌న్న దానిపై అంతా డాక్ట‌ర్లు, ఇంజ‌నీర్లు అంటూ స్పందించ‌గా, ఇబ్ర‌హింప‌ట్నంలో ఒక చిన్నారి క‌లెక్ట‌ర్ అవుతానన‌టంతో ద‌గ్గ‌ర‌కు తీసుకుని ఆశీర్వ‌దించారు. అక్క‌డ పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో మొక్క‌లు నాటారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో కార్య‌ద‌ర్శి వెంబ‌డి గిరిజ‌న సంక్షేమ శాఖ సంచాల‌కులు ర‌వీంద్ర‌బాబు, ఇంజ‌నీర్ ఇన్ ఛీఫ్ శేషు బాబు, జిల్లా గిరిజ‌న సంక్షేమ అధికారి ఈశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హఫీజ్ సయీద్‌‌ను అరెస్ట్ చేసిన పాకిస్తాన్... ప్రధాని ఇమ్రాన్ అమెరికా వెళ్లే ముందు...