రాజ్ భవన్ పూర్వ కార్యదర్శి, సీనియర్ ఐఎఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా వాణిజ్యం పరిశ్రమల శాఖ (ఆహార శుద్ది) కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలోని ఐదవ బ్లాక్ మొదటి అంతస్తులో నూతనంగా కేటాయించిన ఛాంబర్ లో పూజాదికాలు నిర్వహించి బాధ్యతలు తీసుకున్నారు.
తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ తో సహా పలువురు సీనియర్ అధికారులతో మీనా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, ఆహార శుద్ది పరిశ్రమల రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారని ఆక్రమంలోనే ఈ శాఖకు ప్రత్యేకంగా కార్యదర్శి నియామకం జరిగిందన్నారు.
రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఆహార శుద్ది పరిశ్రమల ఏర్పాటును లక్ష్యంగా కలిగి ఉన్నామన్నారు. అయా జిల్లాలలో పండే పంటల అధారంగా ఏ జిల్లాలో ఎటువంటి పరిశ్రమ రావాలన్న దానిపై కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు. రానున్న రెండు సంవత్సరాలలో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలోనూ ఒక ఆహార శుద్ది పరిశ్రమ ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా నిర్దేశించారని తదనుగుణంగా పనిచేస్తామని తెలిపారు. పెద్ద ఎత్తున ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవకాశాలు, నిరుద్యోగులకు ఉపాధి లభించనున్నాయని ముఖేష్ కుమార్ మీనా వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆహార శుద్ధి సొసైటీ సీఈఓ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.