పార్టీలో రెబెల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజుపై ఎలాంటి చర్య తీసుకోవాలన్న అంశంపై వైకాపా అధిష్టానం మల్లగుల్లాలుపడుతున్నారు. కొందరు పార్టీ నుంచి బహిష్కరించాలని అభిప్రాయపడుతుంటే, మరికొందరు మాత్రం ఏకంగా ఆయనపై అనర్హత వేటు వేయించాలన్న డిమాండ్లు చేస్తున్నారు.
నిజానికి గత కొన్ని రోజులు రఘురామకృష్ణంరాజు తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఇస్తూ... పార్టీ ఉనికినే సవాలు చేస్తూ కొత్త లాజిక్కులు లేవనెత్తుతున్నారు. దీంతో ఆయనపై చర్యలు తీసుకునే విషయమై వైసీపీలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. పార్టీ సీనియర్లు ఆయనపై భగ్గుమంటున్నారు. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాల్సిందేనని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు గట్టిగా కోరుతున్నారు.
'షోకాజ్‌కు సమాధానం కాదు' అంటూనే... తనకు అందిన నోటీసులోని అంశాలను ప్రస్తావిస్తూ జగన్‌కు రఘురామ కృష్ణంరాజు సోమవారం ఒక లేఖ రాశారు. వాతావరణాన్ని వేడెక్కించారు. తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఇదివరకే కేంద్రాన్ని కోరారు. లోక్‌సభ స్పీకర్‌కూ ఫిర్యాదు చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోకుండా వదిలేస్తే... మున్ముందు మరికొందరు అదే బాటలో నడిచే ప్రమాదముందని వైసీపీలో ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రాథమికంగా రఘురామ కృష్ణంరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే.. సస్పెండ్ చేస్తే ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు అవుతుందేమోనన్న సందేహాలూ వ్యక్తమయ్యాయి. దీంతో... ఇప్పటిదాకా జరిగిన పరిణామాలను ఆధారంగా చూపిస్తూ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలపై న్యాయ, రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ నేతలు చర్చిస్తున్నారు. ఇదే అంశంపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసి అనర్హత వేటు వేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.