కొండపల్లి మునిసిపాలిటీపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం తథ్యమని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్ జోస్యం చెప్పారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో నాని మాట్లాడుతూ, కొండపల్లి మునిసిపాలిటీ పరిధిలో జరుగుతున్నఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులను ఆఖండ మెజారిటీ తో గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు.
గత రెండున్నర ఏళ్లుగా వైకాపా ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కొండపల్లి మునిసిపాలిటీ పరిధిలో గల 26వ వార్డులో తెలుగు దేశం పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి వల్లెపు కాతురయ్య ను సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగేటును నిలబెట్టి, ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత తెలుగు దేశం పార్టీ కే దక్కుతుందన్నారు. కొత్తగేటుకు అధికార పార్టీ నాయకులు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
శ్రామిక నగర్ లో అటవీశాఖ స్థలంలో ఉన్న 120 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ స్థానికులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఆ విషయం పైన సానుకూలంగా స్పందించిన ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని) తాను కొత్తగేటులోని అటవీశాఖ స్థలంలో ఉన్న 120 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం కేంద్ర స్థాయిలో తాను కృషి చేస్తానని అన్నారు. అవసరమైతే పార్లమెంటు సమావేశాలలో కొత్తగేటు ఫారెస్ట్ సమస్య గురించి మాట్లాడుతానని హామీ ఇచ్చారు.
గత నలభై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ లో ఆ తరువాత 2010 నుండి వైఎస్సార్ సీపీ లో క్రియాశీలంగా పనిచేస్తున్న పానుగంటి చినవెంకటేశ్వరరావు (ఆచారి) గారితో పాటు మరో 10 కుటుంబాలు వైఎస్సార్ సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి.