సింహాచలం ఈవోకు పార్టీ మారి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎంపీ అవంతి శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతలోనే అయిపోలేదని ఈనెల 23వ తేదీ తర్వాత తమ ప్రభుత్వం వస్తుందని అపుడు చూస్తామంటూ అందరిముందే హెచ్చరించారు. పైగా, తాను ఇంకా సిట్టింగ్ ఎంపీనేనని, మాజీని కాలేదంటూ వ్యాఖ్యానించారు. అసలు సింహాచలం ఈవోకు అవంతి శ్రీనివాస్ ఎందుకు వార్నింగ్ ఇచ్చారనే కదా మీ సందేహం.
అక్షయ తృతీయను పురస్కరించుకుని సింహాచలం అప్పన్నకు మంగళవారం చందనోత్సవం నిర్వహించారు. ఇందుకోసం రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇందుకు అనుగుణంగానే ఆలయ అధికారులు ఏర్పాట్లుచేశారు. అయితే, భక్తులకు సర్వదర్శనం త్వరితగతిన పూర్తిచేసేందుకు వీలుగా ప్రత్యేక దర్శనాలతోపాటు వీఐపీ దర్శనాలను రద్దు చేశారు.
అయితే, సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవంతి శ్రీనివాస్ మధ్యాహ్నం సమయంలో స్వామి దర్శనం కోసం ఆలయానికి వచ్చారు. అయితే, ఆయన గర్భాలయంలోకి వెళ్లి దర్శనానికి వెళ్లేందుకు ప్రయత్నించగా, అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై... గర్భగుడి ద్వారం వద్దే దర్శనం చేసుకుని తిరిగి వెళ్లిపోయారు.
ఆ తర్వాత ఆయన ఆలయ నుంచి బయటకు వెళుతుండగా ఈవో రామచంద్రమోహన్ కనిపించారు. అపుడు ఆయనవైపు చూస్తూ.. ఇంతటితో అయిపోలేదనీ, ఈనెల 23వ తేదీ తర్వాత చూస్తానని హెచ్చరిక చేశారు. పైగా, తాను ఇంకా సిట్టింగ్ ఎంపీనేనని, ఇంకా మాజీని కాలేదంటూ వ్యాఖ్యానించారు.
కాగా ప్రస్తుతం టీడీపీ తరపున సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మళ్లీ పోటీ చేసేందుకు టీడీపీ టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పి... వైకాపాలో చేరి, అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ శాసనసభకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఈనెల 23వ తేదీన వెల్లడికానున్న విషయం తెల్సిందే.