అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చరితా రెడ్డి మృతదేహం ఆదివారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరింది. అక్కడి నుంచి కాసేపట్లో నేరేడ్‌మెట్ రేణుకానగర్‌లోని ఆమె నివాసానికి తరలించారు. చరితారెడ్డి పార్థివ దేహాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు అయ్యే ఖర్చులను జమ చేసేందుకు ఆమె స్నేహితులు చేయీ చేయీ కలిపారు. అందరూ ఫేస్‌బుక్ ఆధారంగా ప్రత్యేక ఖాతాను తెరిచి క్రౌడ్ ఫండింగ్ చేశారు.
చరితా రెడ్డి ఈ ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయింది. ఆమె కుటుంబ సభ్యుల అనుమతితో చరిత అవయవాలను ప్రాణాపాయ స్థితిలో ఉన్న 9 మందికి అమర్చారు. చరిత చనిపోయినా మరి కొంతమందికి ప్రాణం పోసిందని అమెరికా సమాజం నివాలులర్పించింది. ప్రస్తుతం ఆమె మృతదేహం హైదరాబాదుకు చేరింది.
గత నెల 27న అమెరికాలోని మిచిగాన్ పరిధి లాన్సింగ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చరితారెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె ప్రయాణిస్తున్న కారును.. వెనక నుంచి మరో కారు వేగంగా ఢీకొట్టడంతో బ్రెయిన్‌డెడ్‌కు గురైంది చరితారెడ్డి. ఆమెతో పాటు మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానిక ముస్కేగాన్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే చరితారెడ్డి బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.