Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్థిక దుస్థితికి మోడీ సర్కార్‌ అసమర్థతే కారణం.. మన్మోహన్‌

Advertiesment
ఆర్థిక దుస్థితికి మోడీ సర్కార్‌ అసమర్థతే కారణం.. మన్మోహన్‌
, సోమవారం, 2 సెప్టెంబరు 2019 (12:20 IST)
దేశం నేడు ఎదుర్కొంటున్న ఆర్థిక దుస్థితికి కేంద్రంలోని మోడీ సర్కార్‌ అసమర్థ నిర్వాకమే కారణమని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ విమర్శించారు. నోట్ల రద్దు, జిఎస్‌టి హడావిడిగా అమలు వంటివి మోడీ ప్రభుత్వ ఘోర తప్పిదాలని ఆయన వ్యాఖ్యానించారు.

దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి తనను తీవ్రంగా కలవరపెడుతోందని ఆర్థికవేత్త కూడా అయిన మాజీ ప్రధాని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక వీడియో ప్రకటనను విడుదల చేశారు. గత త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి 5 శాతానికి పడిపోవడం ఆర్థిక మాంద్యం తీవ్రతకు ఒక స్పష్టమైన సంకేతమన్నారు.

దేశంలో ఉపాధి రహిత అభివృద్ధి జరుగుతోందని ఆయన ఆ వీడియోలో చెప్పారు. దేశం చాలా వేగంగా వృద్ధి చెందే అవకాశాలున్నా మోడీ ప్రభుత్వ అసమర్థ నిర్వాకం వల్లే ఈ దుస్థితి దాపురించిందన్నారు. 'మరీ ముఖ్యంగా మ్యానుఫాక్చరింగ్‌ రంగం వృద్ధి రేటు 0.6 శాతానికి పడిపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

నోట్ల రద్దు (డిమోనిటైజేషన్‌), వేగంగా వస్తుసేవల పన్ను (జిఎస్‌టి) అమలు చేయడం వంటి మానవ నిర్మిత పొరపాట్ల వల్ల మన ఆర్థిక వ్యవస్థ కోలుకోలేకపోయిందని, దేశీయ డిమాండ్‌ నిరుత్సాహపరుస్తోందని అన్నారు. వినియోగ వృద్ధి రేటు 18 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది.

నామమాత్రపు జిడిపి వృద్ధి రేటు 15 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. పన్ను ఆదాయంలో అంతరం ఉంది. పన్ను అస్పష్టంగా ఉండటంతో చిన్న, పెద్ద వ్యాపారులు వేధింపులకు గురవుతున్నారు. ' అని మన్మోహన్‌ తెలిపారు. 
'మోడీ ప్రభుత్వ విధానాల ఫలితంగా నిరుద్యోగం విపరీతంగా పెరిగింది.

అనేక మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. కేవలం ఆటోమొబైల్‌ రంగంలోనే 3.5 లక్షలకు పైగా కోల్పోయారు. అదేవిధంగా అసంఘటిత రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయాయి. ఇది అత్యంత బలహీన కార్మికులను దెబ్బతీస్తుంది' స్పష్టం చేశారు. దేశంలో పల్లె సీమల పరిస్థితిపైనా మన్మోహన్‌ సింగ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

'గ్రామీణ భారతదేశం భయంకరమైన స్థితిలో ఉంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదొడుకుల్ని ఎదుర్కొంటోంది. రైతులకు తగిన ధరలు అందడం లేదు. గ్రామీణ ఆదాయాలు క్షీణించాయి. ఆదాయం విపరీతంగా పడిపోవడంతో రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాల్లోని ప్రజల దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

మోడీ ప్రభుత్వం ప్రదర్శించడానికి ఇష్టపడే తక్కువ ద్రవ్యోల్బణ రేటు దేశ జనాభాలో 50 శాతానికి పైగా కష్టాలను కలిగించడం ద్వారా రైతుల ఆదాయాలు వారి ఖర్చుకు వస్తున్నాయి' అని పేర్కొన్నారు. 
 
'ప్రభుత్వం కింద భారతదేశ విశ్వనీయత డేటా ప్రశ్నార్థకంగా మారింది. బడ్జెట్‌ ప్రకటనలు, వెనక్కి తీసుకోవడాలు అంతర్జాతీయ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని సడలించుకునేలా చేశాయి.

భౌగోలిక రాజకీయాల కారణాలతో అంతర్జాతీయంగా పెరిగిన ఎగుమతుల అవకాశాన్ని ఒడిసిపట్టడంలోనూ, ప్రపంచ వాణిజ్యంలో తలెత్తిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మోడీ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ స్థితి అంత దారుణంగా ఉంది' అని మన్మోహన్‌ సింగ్‌ విమర్శించారు.
 
ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా మేధావులను, నిపుణులను సంప్రదించి సమాలోచనలు చేయడమే ఆర్థిక వృద్ధికి మేలైన మార్గమని ఆయన అన్నారు. 'మన యువత, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, ఔత్సాహక పారిశ్రామిక వేత్తలు ఇలా అన్ని రంగాల వారికి ప్రభుత్వం ఇంకా ఎంతో చేయాల్సి ఉంది.

ఈ తిరోగమన మార్గంలో కొనసాగడం భారతదేశానికి భరించలేనిది. అందువల్ల, వెంటాడి వేధించే రాజకీయాలను పక్కన పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మానవ తప్పిదాల వల్ల ఏర్పడిన సంక్షోభం నుండి ఆర్థిక వ్యవస్థను పురోగమనం వైపు మళ్లించేందుకు మోడీ సర్కార్‌ రాజకీయాలు పక్కన పెట్టి నిపుణుల్ని, మేధావుల్ని సంప్రదించాలి. ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించాలంటే ఇంతకంటే మెరుగైన మార్గం లేదన్నారు' హితవు పలికారు.
 
స్వతంత్ర ప్రతిపత్తి కలిగియున్న రాజ్యాంగ సంస్థల విషయంలో మోడీ ప్రభుత్వం వ్యవహరి స్తున్న తీరును కూడా మన్మోహన్‌ సింగ్‌ తప్పు బట్టారు. చట్టబద్ధ సంస్థలకు దాడికి గురౌతున్నా యని ఆందోళన వెలిబుచ్చారు. 'చట్టబద్ధ సంస్థల్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ సంస్థలన్నీ దాడికి గురవుతున్నాయి.

వాటి స్వయం ప్రతిపత్తి పూర్తిగా దెబ్బతింటోంది. రిజర్వుబ్యాంకు స్థితి స్థాపకత నిధుల్లో రూ.1.76 లక్షల కోట్లు ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో బదిలీ చేశారు. ఈ విండ్‌ఫాల్‌తో ఏమి చేస్తుందనే దానిపై ప్రణాళిక లేదు' అని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షిర్డీలో వైవీ పూజలు... ఎందుకు?