Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభుత్వ మోచేతి నీళ్లు తాగారో.... సామాన్య ఉద్యోగుల‌కే న‌ష్టం!

ప్రభుత్వ మోచేతి నీళ్లు తాగారో.... సామాన్య ఉద్యోగుల‌కే న‌ష్టం!
విజ‌య‌వాడ‌ , శనివారం, 13 నవంబరు 2021 (14:14 IST)
రాష్ట్రంలో ఉద్యోగస్తులు, ప్రభుత్వం మధ్య జరుగుతున్న సంఘటనలు దేశంలో ఇంత వరకూ ఎక్కడా జరగ లేదని, ఉద్యోగుల డిమాండ్లపై ఏ ప్రభుత్వమూ ఇంతలా అలసత్వం, నిరాదరణ చూపిన దాఖలాలు కూడా ఎక్కడాలేవని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అన్నారు. ఉద్యోగ సంఘాలు వాటి బాధ్యతను విస్మరించి, రాజకీయ మైలేజ్ కోసం పాకులాడుతున్నాయని విమ‌ర్శించారు. శనివారం  ఆయన మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 
 
 
ఉద్యోగులు, సంఘాలు ప్రభుత్వాన్ని బతిమాలి బామాలుకునే పరిస్థితి ఎందుకు వచ్చింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఉద్యోగుల సమస్యలు కొన్ని కింది స్థాయిలోనే పరిష్కారమైతే, మరికొన్ని ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళుతుంటాయ‌ని, పీఆర్సీ నివేదిక ఇచ్చి, ఉద్యోగ సంఘాలు మాకివి కావాలని అడిగే పరిస్థితి లేకుండా ప్రభుత్వం ఎందుకు చేస్తోంద‌ని ప్ర‌శ్నించారు. పీఆర్సీ నివేదిక ఇవ్వడానికే ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నార‌ని, మూడు డీఏలు మూడేళ్లపాటు మంజూరు చేస్తామని చెప్పిన ప్రభుత్వం, పీఆర్సీపై కూడా స‌మాధానం ఎందుకు చెప్పలేకపోతోందని అశోక్ బాబు విమ‌ర్శించారు. 
 
 
ఫిట్ మెంట్, ఇతర వాటిపై తాము నిర్ణయం తీసుకోలేమని, కొంత సమయం కావాలని అడ‌గడానికి ప్రభుత్వం ఎందుకు సంకోచిస్తోంది?  ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఉద్యోగ సంఘాల నేతలు వాస్తవాలు చెప్పకుండా ఎందుకు సన్నాయినొక్కులు  నొక్కుతున్నారు? ఉద్యోగ సంఘం నేత ఒకాయన ఉద్యోగులెవరూ ఇప్పుడు ధర్నాలు చేసే స్థితిలో లేర‌ని ఎందుకు అంటున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.  
 
 
ఉద్యోగులు వారి హక్కుల కోసం రోడ్లపైకి రావడానికి సిద్ధంగా లేరని ఆయన అభిప్రాయమా? ల‌ఏక ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలను ఏమైనా చేస్తుందని వారు భయపడుతున్నారా? వారిపై రాజకీయ కక్ష సాధింపులు ఉంటాయని వారు జంకుతున్నారా? ఉద్యోగ సంఘాల నేతలు, పీఆర్సీ నివేదిక ఇచ్చాకే జాయంట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్ చేయలేకపోతు న్నారు?  అని ప్ర‌శ్నించారు. 
 
గతంలో తెలంగాణ, ఆంధ్రా ఉద్యోగులు పీఆర్సీ విషయంలో కలిసి పోరాడి, అనుకున్నది సాధించారు. పోరాడకుండా ఉద్యోగ సంఘాలు చర్చలు జరిపితే ఫలితం ఉండదని త‌న అభిప్రాయం అని అశోక్ బాబు తెలిపారు. ఉద్యోగులు ఏదో ఒక కార్యక్రమానికి పిలుపునివ్వకపోతే, ప్రభుత్వం ఎందుకు స్పందిస్తుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి జీ హూజూర్ అనబట్టే, పాలకులు, ఉద్యోగుల డిమాండ్లపై స్పందించడం లేద‌న్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఉద్యోగ సంఘాల నేతలు పడిగాపులు పడటం ఏమిటి? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 
 
 
చంద్రబాబు నాయుడు గతంలో ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇస్తే, ఈ ప్రభుత్వం ఐఆర్ ను 27 శాతంనుంచి పెంచాలా తగ్గించాలా అని ఆలోచిస్తోంద‌ని, 2018 నుంచి ఇవ్వాల్సిన డీఏల్లో ఒక డీఏ వచ్చే ఏడాది మార్చికి ఉద్యోగులకు అందుతుంద‌న్నారు. 2019 జులూ తరువాతి నుంచి ఆరు డీఏలు పెండింగ్ లో ఉన్నాయ‌ని, రిటైర్ మెంట్ బెనిఫిట్స్, జీపీఎఫ్ అడ్వాన్స్ ల గురించిన ఆలోచనే ఈ ప్రభుత్వం చేయడం లేద‌ని విమ‌ర్శించారు. ఉద్యోగుల తాలూకా జీపీఎఫ్ సొమ్ముని, వారికి తెలియకుండానే ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంద‌ని, ఇంత దుర్మార్గమైన చర్యలు ఈ రాష్ట్రంలో తప్ప ఎక్కడా లేవ‌న్నారు. 

 
ప్రభుత్వం నేరం చేసినప్పుడు ఎవరిని  శిక్షించాలి? ప్రభుత్వాన్ని నడిపే అధికారులు, అసలు రథసారథి అయిన ముఖ్యమంత్రినే నిలదీయాలి. ఆర్థిక మంత్రికి అసలు ఈ వ్యవహారాలు పట్టడం లేదు. నెలలో 30 రోజులు ఆయన ఢిల్లీలోనే ఉంటూ, అప్పుల కోసం తిరుగుతున్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శి పాత్ర నామమాత్రమే అయింది. ఈ విధంగా ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై ప్రభుత్వం తాత్సారం చేస్తుంటే, ఉద్యోగ సంఘాలు అల్టిమేటం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాయి. దాని వల్ల ప్రభుత్వం ఉద్యోగ సంఘాల అలసత్వాన్ని వాడుకొని, పబ్బం గడుపుకుంటోంద‌ని చెప్పారు.

అంతిమంగా సామాన్య ఉద్యోగులే తీవ్రంగా నష్టపోతున్నార‌ని, ఇల్లు కట్టుకోవడానికి రుణాలు పొందాలన్నా, వైద్య సౌకర్యాలు పొందాలన్నా, ఇతరత్రా ప్రయోజనాలు పొందాలన్నా ఉద్యోగులకు అవకాశం లేకుండా పోయింద‌న్నారు.  ఉపాధ్యాయ సంఘాల తరుపున 8, 9 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. కానీ వారు కూడా స్పందించడం లేద‌ని, పోరాడకుండా ప్రభుత్వ మోచేతి నీళ్లు తాగాలనే ఉద్యోగ సంఘాల మనస్తత్వంతో అంతిమంగా నష్టపోతున్నది కింది స్థాయి ఉద్యోగులే అని అశోక్ బాబు అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాక