వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముసలోడు అయ్యాడంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. పేర్ని నాని వ్యాఖ్యలు వెనుక కుట్ర దాగి ఉందన్నారు. టీడీపీని రెచ్చగొట్టి కొడాలి నాని, వల్లభనేని వంశీలను అరెస్టు చేయిస్తే తన కొడుకును కృష్ణా జిల్లా సామ్రాజ్యాన్ని అప్పగించాలని పేర్ని నాని పన్నిన పన్నాగమే ఇదంతా అని ఆయన వ్యాఖ్యానించారు.
ఆయన సోమవారం మంగళగిరిలో విలేకరులతో మాట్లాడుతూ, వైకాపా విలువ లేని రాజకీయాలు చేస్తుదన్నారు. పేర్ని నాని భాష సరైనది కాదని, అందువల్ల ఆయన తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
వైకాపా ప్రభుత్వంలో జగన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలు, చర్యల వల్ల రాజకీయాలు రోడ్డున పడుతున్నాయని. సినిమాల్లో రాజనాల కుట్రలు కుతంత్రాలు ఎలా ఉండేవో నేడు జగన్ రెడ్డి కుట్రలు అలా ఉంటున్నాయి. రాజకీయాల్లో విలువలు లేకుండా వేకాపా నేతలు మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని వాడే భాష ఏంటి. ప్రజలు ఛీ కొట్టిన ఇంకా సిగ్గు రాలేదా? ఒకపుడు ఇలా మాట్లాడే వల్లభనేని వంశీ జైలుకు పోయి ఊచలు లెక్కించి, బ్రతుకు జీవుడా అంటూ బయటకి వచ్చాడు.
జగన్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు శాసనసభలో ఏమి స్క్రిప్టు ఇస్తే అది మీరు చదవాలి. అలా రాసి చదవమంటే నేను చదవను అని మాగుంట శ్రీనివాసులు రెడ్డి పక్కకి నెట్టేశాడు. ఈ రోజు పేర్ని నానిలాంటి వారు జగన్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్టు చదివేస్తూ ఘోరంగా మాట్లాడుతున్నాడు.. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.. త్వరలోనే ఊచలు లెక్కించాల్సివస్తుందంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు.