విద్యాబుద్ధులు నేర్చుకోమని పాఠశాలకు పంపించే యువతీయువకులు చిన్నవయసులోనే అడ్డదారులు తొక్కుతున్నారు. ముఖ్యంగా, యుక్త వయసుకు వచ్చిన అమ్మాయి, అబ్బాయిలు చిన్నవయసులోనే ప్రేమలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగిన ఓ ఘటన కలకలం రేపింది.
ఈ కాలేజీకి చెందిన విద్యార్థి, విద్యార్థిని పెళ్లి చేసుకున్నారు. కాలేజీ నడుస్తున్న సమయంలోనే తరగతి గదిలోనే అమ్మాయి మెడలో పసుపుతాడు కట్టాడు. నుదుట బొట్టుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఇద్దరు మైనర్లు వివాహం నవంబర్ 17న జరిగినట్లు వీడియోల ద్వారా తెలుస్తోంది.
దీంతో కాలేజీలో పెళ్లి జరిగిన వీడియోలు వైరల్గా మారాయి. వైరల్ అయిన వీడియో, ఫోటోలు కాలేజీ ప్రిన్సిపాల్ వరకు వెళ్లాయి. ఈ విషయం తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ ఇద్దరు విద్యార్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు వీరికి సహాయం చేసిన మరో విద్యార్థికి కూడా టీసీ ఇచ్చి కాలేజీ నుంచి ముగ్గురిని పంపిచారు.