Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్టోబర్ 2 నుంచి 'మనం-మన పరిశుభ్రత' రెండోదశ: ప్రజాప్రతినిధులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేఖ

Advertiesment
Minister Peddireddy Ramachandrareddy
, బుధవారం, 23 సెప్టెంబరు 2020 (21:41 IST)
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యవంతమైన గ్రామసీమల కోసం ప్రారంభించిన 'మనం-మన పరిశ్రుభ్రత' రెండోదశ కార్యక్రమాన్ని అక్టోబర్ 2వ తేదీన గాంధీజయంతి రోజు నుంచి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

ప్రజల్లో పారిశుధ్యం, ఆరోగ్య సంరక్షణపై చైతన్యం కలిగించేందుకు తొలి విడతగా నిర్వహించిన మనం-మన పరిశుభ్రత పక్షోత్సవాలు విజయవంతం అయ్యాయని తెలిపారు.  గ్రామాల్లో ప్రజా భాగస్వామ్యంతో ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 1వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు.

తొలిదశలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 1320 పంచాయతీల్లో జూలై 24 నుంచి నిర్వహించిన 'మనం-మన పరిశుభ్రత' పక్షోత్సవాల్లో మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో పాటు వివిధ దశల్లోని ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తోడవటం వల్ల ఈ కార్యక్రమం విజయవంతం అయ్యిందని తెలిపారు.

అలాగే పంచాయతీరాజ్‌ ఉద్యోగులు ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సమర్థవంతంగా పనిచేశారని తెలిపారు. గ్రామాల్లో మంచినీరు, పారిశుధ్యం, మురుగునీటి కాలువల వ్యవస్థ, చెత్త డంపింగ్, ఆరోగ్య కేంద్రాలు, అవి అందిస్తున్న సేవలు ఇలా ప్రజల ఆరోగ్యపరమైన అన్ని అంశాలపైన ఈ పక్షోత్సవాల్లో ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు.

పైలెట్ గ్రామాలుగా ఎంపిక చేసిన వాటిని ఓడిఎఫ్‌ గ్రామాలుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ముందడుగు పడిందని అన్నారు. 
ప్రధానంగా రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో ప్రారంభమైన తొలిదశ కార్యక్రమాలు పల్లెల్లో ఆరోగ్యవంతమైన మార్పులను తీసుకువచ్చాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ పక్షోత్సవాల కారణంగా నిర్వహించిన పంచాయతీల్లో 70 శాతం సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టడం విశేషమని అన్నారు.

అంతేకాకుండా తమ పంచాయతీల అవసరాలకు తాము సైతం అంటూ ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఏకంగా 1,72,16,419 రూపాయలను విరాళాల రూపంలో అందించడం ప్రజల్లోని చైతన్యానికి నిదర్శనమని అన్నారు. జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం అందరి మన్ననలను పొందడంతో పాటు, జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించిందని అన్నారు.

పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ లు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడంతో పాటు క్షేత్రస్థాయిలో అధికారులను, సిబ్బందిని ఉత్సాహంగా దీనిలో భాగస్వాములను చేయడం వల్లే ఇటువంటి మంచి ఫలితాలను సాధించగలిగామని, వారికి అభినందనలు తెలిపారు.

ఈ రాష్ట్రంను స్వచ్చాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే క్రమంలో, కోవిడ్ వంటి మహమ్మారిని ధైర్యంగా తరిమికొట్టే కార్యక్రమంలో అన్ని వర్గాలు రెండోదశ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రంలోని మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో పాటు వివిధ దశల్లోని ప్రజాప్రతినిధులు కూడా తమవంతు స్పూర్తిదాయకమైన చేయూతను అందించాలని వారికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిటిడి డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన జ‌గ‌న్‌