ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. 2021 డిసెంబరులో రాష్ట్ర ప్రజలకు జీవనాడిగా పరిగణించే పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని అసెంబ్లీతో పాటు.. పలు బహిరంగ సభల్లో ప్రగల్భాలు పలికారు. కానీ, డిసెంబరు నెల వచ్చేసింది. ఒకటి తేదీ వెళ్లిపోయింది. దీంతో నెటిజన్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను ట్రోల్ చేస్తున్నారు. డిసెంబరు ఒకటి పోయింది.. పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఎక్కడా అంటూ ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా, తెలుగు తమ్ముళ్లు అయితే "మా గోదావరి జిల్లాల్లో ఎటువంటి హంగు, ఆర్భాటం ఈ రోజు కనిపించలేదు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం అని మంత్రిగారు అసెంబ్లీలో చెప్పారు. కానీ మాకు ఆహ్వానం లేదేమో అనుకున్నాం. ఇంతకూ ఈ రోజు ఓపెనింగ్ ఉందా లేదా? అంటూ టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చిన్నరాజప్పా ట్వీట్ చేశారు.
పైగా, ఈ ప్రాజెక్టు గురించి మంత్రి గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2021 డిసెంబరు నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని మంత్రి చేసిన ఛాలెంజ్‌ను గుర్తుచేస్తున్నారు. ప్రాజెక్టును పూర్తి చేశారు కదా.. మరి ఎపుడు ప్రారంభిస్తున్నారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా తనకు వ్యతిరేకంగా సాగుతున్న ట్రోలింగ్‌పై మంత్రి అనిల్ ఘాటుగానే స్పందించారు.