ఎన్నికల్లో ఆ పార్టీకే మద్దతు.. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తే..?: మేకపాటి
అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్‌లో చర్చ జరగని పక్షంలో రాజీనామాలకు సిద్ధం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంపీలకు సూచించిన నేపథ్యంలో.. జగన్‌తో భేటీ అనంతరం వైకాపా ఎంపీ మేకపాటి
అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్‌లో చర్చ జరగని పక్షంలో రాజీనామాలకు సిద్ధం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంపీలకు సూచించిన నేపథ్యంలో.. జగన్‌తో భేటీ అనంతరం వైకాపా ఎంపీ మేకపాటి మీడియాతో మాట్లాడారు. టీడీపీకి మెజార్టీ ఎంపీలున్నా ప్రత్యేక హోదా సాధనలో విఫలమైందని దుయ్యబట్టారు.
తమకు 20 మంది ఎంపీలను ఇస్తే కచ్చితంగా హోదా సాధించి తీరుతామని, హోదా సాధాన విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడమని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఏ పార్టీ ఇస్తుందో, ఎన్నికల తర్వాత ఆ పార్టీకే మద్దతిస్తామని మేకపాటి తెలిపారు.
ఇక అవిశ్వాసంపై వాయిదా పర్వం కొనసాగితే.. ఒకవేళ పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడితే ఆ రోజే తాము స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు చేస్తామని మేకపాటి స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలని.. 25మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే కేంద్రంపై ఒత్తిడి పడుతుందని మేకపాటి అన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని మేకపాటి విమర్శించారు. నాడు కనిగిరి సభలో అవిశ్వాసం పెడతామని తాము ప్రకటించగానే, అవిశ్వాసంతో ఏమవుతుంది? అని చంద్రబాబు ప్రశ్నించిన విషయాన్ని మేకపాటి గుర్తు చేశారు. అవిశ్వాసానికి కాంగ్రెస్, లెఫ్ట్, తృణమూల్, బీఎస్పీ, ఎస్పీ మద్దతిచ్చిందని.. ప్రస్తుతం సీపీఎం కూడా నోటీసులిచ్చిందని మేకపాటి వ్యాఖ్యానించారు.