త్వరలో ముఖ్యమంత్రి దొనకొండలో కొత్త ప్రాజెక్టు తీసుకురాబోతున్నారని, అతి త్వరలో ఆ వివరాలు ప్రకటించబోతున్నారని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. దొనకొండలో మెగా ఇండస్ట్రియల్ హబ్ స్థాపనపై ప్రభుత్వ ప్రతిపానదలు ఏమైనా ఉన్నాయా అని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రశ్నించారు. దీనిపై పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
"గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ప్రైడ్ అనే ప్రాజెక్ట్ ప్రతి రాష్ట్రానికి ఇవ్వాలని అనుకున్నారు. ప్రైడ్ అంటే.. రీజనల్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్. కేంద్ర ప్రభుత్వం 5వేల ఎకరాలు దొనకొండలో ఇవ్వమని కోరారు. తద్వారా ఇండస్ట్రియల్ హబ్ తెస్తామని చెప్పటం జరిగింది. 2017లో అప్పటి ఏపీఐఐసీ ఎండీ, ఛైర్మన్ కూడా కేంద్రానికి లేఖ రాయటం, చెప్పటం జరిగింది. గత ప్రభుత్వం 2,450 ఎకరాలకు మాత్రమే పరిమితం చేశారని అలా కాకుండా మరో 2,550 ఎకరాలు కేటాయించినట్లైతే దొనకొండకు గొప్ప ఇండస్ట్రియల్ హబ్ వచ్చి ఉండేది" అని మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు.